
పెళ్లి చేసి చూడు.. ఇళ్లు కట్టి చూడు అన్నారు పెద్దలు. ఎందుకంటే.. ఈ రెండూ ఖర్చుతో కూడుకున్నవికాబట్టి అలా చెబుతుంటారు. ఈ రోజుల్లో ఎంత సింపుల్ గా పెళ్లి చేయాలన్నా.. రూ.లక్షల్లో ఖర్చు పెట్టాల్సిందే. కానీ.. ఓ జంట మాత్రం కేవలం రూ.500 లతో పెళ్లి చేసుకున్నారు. వాళ్లేమి డబ్బులకు కొదవ ఉన్నవారు కూడా కాదు. ఆమె మెజిస్ట్రేట్ కాగా.. ఆయన ఓ ఆర్మీ మేజర్. వారిద్దరూ ఇప్పుడు కేవలం రూ.500 ఖర్చుతో పెళ్లి చేసుకొని ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వివాహానికి విపరీతంగా ఖర్చులు పెడుతున్న సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ ధార్ జిల్లాలో.. ఓ ఆర్మీ మేజర్ , సిటీ మెజిస్ట్రేట్‌లు చాలా సింపుల్‌గా వాళ్ల పెళ్లి తతంగాన్ని ముగించేశారు. ఇరుకుటుంబాల సమక్షంలో వీరివురు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎంత సింపుల్‌గా అంటే కేవలం దండలు, స్విట్లు కోసం రూ.500 ఖర్చు చేశారంతే. వధువు శివంగి జోషి ధార్ నగర మెజిస్ట్రేట్ కాగా, వరుడు అంకిత్ చతుర్వేది భారత సైన్యంలో మేజర్‌గా లడఖ్‌లో పని చేస్తున్నారు. వీరిద్దరూ భోపాల్‌కు చెందినవారు.
కాగా వీరివురి వివాహం రెండు సంవత్సరాల క్రితం నిశ్చయమైంది. అయితే మేజర్ అంకిత్ చతుర్వేది లడఖ్ లో పని చేస్తుండగా, శివంగి ధార్ జిల్లాలో సిటి మెజిస్ట్రేట్‌గా కరోనా అడ్డుకట్టకు నిరంతరంగా విధులు నిర్వర్తిస్తున్న కారణంగా వీరి వివాహ తేది వాయిదా పడుతూ చివరకు ఇలా చేసుకున్నారు. వివాహం అనంతరం శివంగి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా ఇంకా పూర్తిగా అంతమవలేదని, ప్రజలు కొవిడ్ నిబంధనలను పాటించాలని అన్నారు. "వివాహానికి విపరీతంగా ఖర్చు చేయడం మాకు నచ్చలేదని, అందుకే మేమే ఇలా చేసుకున్నట్లు" ఆమె తెలిపారు.