Nitish Kumar: రాహుల్ గాంధీ యాత్రకు నితీశ్ కుమార్ దూరం.. ‘మళ్లీ బీజేపీతో దోస్తీ’

By Mahesh K  |  First Published Jan 25, 2024, 4:25 PM IST

రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర ఈ నెల 30వ తేదీన బిహార్‌లోకి ప్రవేశించనుంది. ఈ యాత్రలో పాల్గొనాలని సీఎం నితీశ్ కుమార్‌కు ఆహ్వానం అందింది. కానీ, ఆయన ఈ యాత్రలో పాల్గొనబోవడం లేదని తెలిసింది. సీట్ల పంపకంపై జాప్యంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న నితీశ్ మొత్తంగా కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి నుంచి బయటికి రావాలని ఆలోచిస్తున్నట్టు కొన్ని విశ్వసనీయ వర్గాలు వివరించాయి.
 


Rahul Gandhi: కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగలనుంది. రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో నితీశ్ కుమార్ పాల్గొనడం లేదని తెలిసింది. సీట్ల పంపకాలపై కాంగ్రెస్ వహిస్తున్న జాప్యంపై నితీశ్ కుమార్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ కూటమిపై ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాదు, బిహార్‌ రాష్ట్రంలో కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి నుంచి జేడీయూ నిష్క్రమిస్తున్నదనే మరికొన్ని వర్గాలు చెప్పాయి. ఈ ఎన్నికల్లో జేడీయూ మళ్లీ బీజేపీతో చేతులు కలుపనుందని వివరించాయి.

భారత్ జోడో న్యాయ్ యాత్ర ఈ నెల 30వ తేదీన బిహార్‌లోకి ప్రవేశించనుంది. ఈ యాత్రలో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేత షకీల్ అహ్మద్ ఖాన్ ద్వారా నితీశ్ కుమార్‌కు ఆహ్వానం అందించారు. కానీ, నితీశ్ కుమార్ ఈ యాత్రలో పాల్గొనడానికి విముఖంగా ఉన్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Latest Videos

Also Read: మొరుసుపల్లి షర్మిల శాస్త్రి: వైఎస్ఆర్ రాజకీయ వారసత్వంపై పోరు.. వైసీపీ టార్గెట్ ఇదేనా?

మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన మరుసటి రోజే నితీశ్ కుమార్ కూడా అసంతృప్తితో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్  కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగుతుందని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని అన్నారు. సీట్ల పంపకంపై సమస్యతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె వివరించారు. ఆ తర్వాత పంజాబ్ ఆప్‌ కూడా ఇండియా కూటమికి వ్యతిరేకంగా మాట్లాడింది. తాజాగా, ఇండియా కూటమి కోసం ఆది నుంచి శ్రమించిన నితీశ్ కుమార్ కూడా ఇప్పుడు దూరం కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

click me!