ప్రాణ ప్రతిష్ట తరువాత రామ్ లల్లా మారిపోయారు..కొత్తగా కనిపించారు - శిల్పి అరుణ్ యోగిరాజ్

By Sairam Indur  |  First Published Jan 25, 2024, 3:59 PM IST

తాను తయారు చేసినప్పుడు రామ్ లల్లా (RAM LALLA) ఒకలా కనిపించారని, ప్రాణ ప్రతిష్ట (Prana pratishtha)తరువాత మరోలా కనిపించారని అయోధ్య (Ayodhya) రాముడి విగ్రహ రూప శిల్పి అరుణ్ యోగి రాజ్ (sculptor Arun Yogiraj) అన్నారు. విగ్రహం రూపొందించిన 7 నెలలు తనకు సవాల్ గా గడిచిందన తెలిపారు.


అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట తరువాత రామ్ లల్లా పూర్తిగా భిన్నంగా కనిపించారని విగ్రహ రూపకర్త, శిల్పి అరుణ్ యోగిరాజ్ చెప్పారు. ఆ విగ్రహాన్ని తాను తయారు చేసిందేనా ? అని తనలో తాను అనుకున్నానని చెప్పారు. ‘ఆజ్ తక్ టీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ లల్లా పూర్తిగా కొత్త కనిపించారు. అది నా పని కాదని నాలో నేను అనుకున్నాను. ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం తర్వాత దేవుడు మరో రూపు దాల్చారు. శ్రీరాముడు పూర్తిగా మారిపోయారు.’’ అని యోగి రాజ్ చెప్పారు.

గత ఏడు నెలలు చాలా సవాలుగా గడిచిందని యోగి రాజ్ చెప్పారు. ఎందుకంటే తనకు భారీ బాధ్యత అప్పగించారని తెలిపారు. 7 నెలల పాటు విగ్రహాన్ని చెక్కే పనిలో నిమగ్నమయ్యానని అన్నారు. దేవుడిని ఎలా చూస్తారో అని పగలు, రాత్రి ఆలోచించేవాడినని అన్నారు. ముందుగా ఐదేళ్ల పిల్లలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించామని చెప్పారు. ఐదేళ్ల పిల్లవాడిలో రామ్‌ని కనుగొనడం తమకు సవాలుగా మారిదని అన్నారు. 

Latest Videos

‘‘నిర్మాణ సమయంలో వారు (రామ్ లల్లా విగ్రహం) భిన్నంగా ఉన్నారు. ప్రాణ ప్రతిష్ట తర్వాత వారు భిన్నంగా కనిపించారు. ఇది నా పని కాదని నేను భావించాను. దేవుడు వివిధ రూపాలు ధరించారు’’ అని ఆయన అన్నారు. ఈరోజు ప్రపంచం మొత్తం సంతోషంగా ఉందని అన్నారు. అందుకే తాను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానని చెప్పారు. ‘‘రాం లల్లా దేశం మొత్తానికి చెందినవారు. రాం లల్లాపై దేశ ప్రజల ప్రేమ కనిపిస్తుంది. భావోద్వేగాన్ని రాయిలోకి తీసుకురావడం అంత సులభం కాదు. దానితో ఎక్కువ సమయం గడపాలి. అందుకే నేను రాయితో ఎక్కువ సమయం గడపాలని, పిల్లల లక్షణాలను అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నాను. మిగతావన్నీ రామ్ లల్లా వల్లనే జరిగాయి.’’ అని యోగిరాజ్ అన్నారు. 

ఏడు నెలలుగా తనకు నిద్ర సరిగా పట్టడం లేదని అరుణ్ యోగిరాజ్ చెప్పారు. పడుకున్నాక కూడా తనకు రామ్ లల్లానే కనిపించేవారని తెలిపారు. తమ కుటుంబం 300 ఏళ్లుగా విగ్రహాలను చెక్కే పనిలో ఉందని, తాను ఐదో తరం కళాకారుడిని చెప్పారు. రాముడి అనుగ్రహంతోనే కార్యాలు సిద్ధిస్తాయని, ఇది తమ పూర్వీకుల ఆదర్శం అని అన్నారు. నాన్న తనకు మొదటి గురువు అని చెప్పారు. 

ఇదిలా ఉండగా.. అయోధ్యలోని రామ మందిరంలో శ్రీ రాముడి విగ్రహం శాలిగ్రామ్ స్టోన్ తో  తయారు చేశారు. దీన్ని పవిత్ర రాయిగా భావిస్తారు. అంతేకాదు ఇది చాలా మృధువుగా ఉంటుంది. అయితే విగ్రహాన్ని తయారు చేసేందుకు ముందుగా అరుణ్ యోగిరాజ్ కు ఆలయ ట్రస్ట్ నిర్దిష్ట ప్రమాణాలను అందజేసింది. విగ్రహంలో చిరునవ్వు ముఖం, దివ్య రూపం, 5 ఏళ్ల బాలుడి రూపం, ప్రిన్స్/యువరాజా లుక్ ఉండాలని సూచించారు. దాని ప్రకారమే యోగిరాజ్ రామ్ లల్లా విగ్రహాన్ని తయారు చేశారు. 
 

click me!