ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే యోచనలో నితీష్ , ఎన్డీయే దిశగా అడుగులు .. బీహార్‌లో మళ్లీ ఎన్నికలు తప్పవా.?

By Siva KodatiFirst Published Jan 25, 2024, 9:46 PM IST
Highlights

ఇండియా కూటమిలో రేగిన చిచ్చు బీహార్ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలంతా పాట్నాకు రావాలని జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆదేశించారు. నితీష్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఇండియా కూటమిలో రేగిన చిచ్చు బీహార్ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలంతా పాట్నాకు రావాలని జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆదేశించారు. నితీష్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇండియా కూటమిలో కీలకపాత్ర పోషిస్తున్న నితీష్ కుమార్ .. సంకీర్ణ పార్టీల కూటమితో తెగదెంపులు చేసుకోవచ్చనే నివేదికలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. దీనికి తోడు నితీష్ కుమార్ తిరిగి ఎన్డీయే కూటమిలో తిరిగి చేరడానికి బీజేపీ ఆమోదం తెలిపిందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ పరిణామాలు బీహార్‌లో అసెంబ్లీ రద్దుకు దారి తీసే అవకాశాలున్నాయన్నది వాటి సారాంశం. 

నితీష్ కుమార్ తన అధికారిక నివాసంలో లాలన్ సింగ్, మంత్రి విజయ్ చౌదరి వంటి కీలక నేతలతో వరుస భేటీలు నిర్వహించినట్లుగా కథనాలు వస్తున్నాయి. నితీష్ కుమార్ స్థాపించిన ఇండియా కూటమి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)తో సంబంధాలు తెంచుకుని బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే)లో తిరిగి చేరడంపై పావులు కదుపుతున్నందున బీహార్ రాజకీయాలు భారీ కుదుపులకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Latest Videos

ఈ పరిణామాల మధ్య.. బీజేపీ తన ఎమ్మెల్యేందరినీ పాట్నాకు పిలిపించడం దుమారం రేపుతోంది. ఒకవేళ నితీష్ కుమార్ నిజంగానే బీజేపీతో చేతులు కలిపితే బీహార్ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు సిద్ధమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చర్య రాష్ట్ర రాజకీయ దృశ్యంపై .. ప్రత్యేకించి లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తీవ్ర పరిణామాలను కలిగిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఫిబ్రవరి 4న ప్రధాని నరేంద్ర మోడీ, నితీష్ కుమార్‌లు పాల్గొనే భారీ ర్యాలీ బీహార్ రాజకీయ భవిష్యత్తుపై మరిన్ని ఊహాగానాలకు కారణమవుతున్నాయి.

ప్రస్తుతం ఎనిమిదోసారి ముఖ్యమంత్రిగా వున్న నితీష్ కుమార్ తన ఎత్తుగడలు, కూటమి ఏర్పాటులతో రాజకీయ చాణక్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బీజేపీ, ఇతర పార్టీలతో పొత్తుల మధ్య ఆయన రాజకీయం నడుస్తోంది. 2014లో ఎన్డీయే నుంచి వైదొలగడం, 2015లో మహాకూటమిని ఏర్పాటు చేయడం, 2017లో దానిని విచ్ఛిన్నం చేయడం, 2017లో తిరిగి ఎన్డీయేలో చేరడం వంటి కూటమి డైనమిక్స్‌లో నితీష్‌ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. 

ఇప్పటికే బెంగాల్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఎదురుదెబ్బలు తిన్న ఇండియా కూటమికి బీహార్‌లో నితీష్ కుమార్ వైఖరిలో వచ్చిన ఆకస్మిక మార్పు సవాళ్లు విసురుతోంది. పశ్చిమ బెంగాల్‌లో ఒంటరిగా పోటీ చేస్తానని మమతా బెనర్జీ ప్రకటించడం, పంజాబ్‌లో ఇదే ఫాలో అవుతామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించడంతో ఇండియా కూటమి ఐక్యతను ప్రమాదంలో పడేసింది. పంజాబ్‌లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ, బెంగాల్‌లో అధిర్ రంజన్ చౌదరి వంటి నేతలు విమర్శలు సైతం కూటమికి బీటలు పడేలా చేస్తున్నాయి.

బీహార్‌లో నితీష్ కుమార్ తదుపరి చర్య.. ఆ రాష్ట్ర భవిష్యత్తుతో పాటు ఇండియా కూటమి మనుగడపై ప్రభావం చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం, పొత్తులు మార్చడం, అసెంబ్లీని రద్దు చేయడం వంటి అంశాలు నితీష్ కుమార్‌లోని రాజకీయ చాతుర్యానికి నిదర్శనం. 

click me!