Coronavirus: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా.. ఐసొలేషన్‌లోకి వెళ్లిన మంత్రి

By Mahesh KFirst Published Jan 12, 2022, 12:36 AM IST
Highlights

కరోనా మహమ్మారి బారిన మరో కేంద్ర మంత్రి పడ్డారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా సోకింది. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, కరోనా టెస్టులో పాజిటివ్ అని రిపోర్టు వచ్చిందని ఆయన మంగళవారం ట్వీట్ చేసి వెల్లడించారు. తనతో కాంటాక్టులోకి వచ్చిన వారినీ టెస్టు చేసుకోవాల్సిందిగా సూచనలు చేశారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాతి రోజే నితిన్ గడ్కరీ కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు.
 

న్యూఢిల్లీ: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Union Minister Nitin Gadkari) కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్(Coronavirus Positive) అని తేలడంతో ఐసొలేషన్‌(Isolation)లోకి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేసి మంగళవారం వెల్లడించారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నట్టు వివరించారు. ‘స్వల్ప లక్షణాలతో తనకు కరోనా పాజిటివ్ అని ఈ రోజు నిర్ధారణ అయింది. ప్రోటోకాల్స్ అనుసరించి నన్ను నేను ఐసొలేట్ చేసుకున్నాను. హోం క్వారంటైన్‌లో ఉన్నాను. నాతో కాంటాక్టులోకి వచ్చిన వారందరూ ఐసొలేషన్‌లోకి వెళ్లండి. ఆ తర్వాత కరోనా టెస్టు చేసుకోండి’ అని ఆయన ట్వీట్ చేశారు.

ఈ రెండు రోజుల్లో పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. సోమవారమే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బిహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్, కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై కరోనా మహమ్మారి బారిన పడ్డ సంగతి తెలిసిందే. తర్వాతి రోజే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా కరోనా బారిన పడ్డారు. గతంలోనూ నితిన్ గడ్కరీకి కరోనా సోకింది. 2020 సెప్టెంబర్‌లో నితిన్ గడ్కరీకి కరోనా సోకింది. ఆయన తన మెడికల్ చెకప్స్ చేసుకుంటుండగా, తాను కరోనా బారినపడ్డట్టు తెలిసింది. దీంతో ఆయన అప్పుడే తనను తాను ఐసొలేట్ చేసుకున్నారు.

భారత్‌లో కరోనా వైరస్‌ (Coronavirus) కలకలం కొనసాగుతుంది. రోజువారి కేసుల సంఖ్య భారీగా నమోదవుతుంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,68,063 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి భారత్‌తో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,58,75,790కి చేరింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Union Health Ministry) బులిటెన్ విడుదల చేసింది. అయితే తాజాగా నమోదైన కేసులు కిందటి రోజు నమోదైన కేసుల సంఖ్య (1,79,723) కంటే 6.5 శాతం తక్కువగా ఉన్నాయి. ఇక, గత 24 గంటల్లో కరనాతో 277 మంది మృతిచెందారు. 

దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,84,213కి చేరింది. తాజాగా కరోనా నుంచి 69,959 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,45,70,131కి చేరింది. ప్రస్తుతం దేశంలో 8,21,446 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రోజువారి పాటిజివిటీ రేటు 10.64 శాతంగా ఉంది. 

కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 33,470, పశ్చిమ బెంగాల్‌లో 19,286, ఢిల్లీలో 19,166, తమిళనాడులో 13,990, కర్ణాటకలో 11,698 కేసులు నమోదయ్యాయి. ఇక, దేశంలో నిన్న 15,79,928 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటివరకు భారత్‌లో మొత్తంగా 69,31,55,280 శాంపిల్స్‌కు పరీక్షించినట్టుగా పేర్కొంది. 

మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 4,461 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో నిన్న 92,07,700 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,52,89,70,294కు చేరింది. 

click me!