Omicron: ప్రతి ఒక్కరికీ ఒమిక్రాన్ సోకుతుంది.. బూస్టర్ డోసుతో ఆపడం సాధ్యం కాదు .. టాప్ మెడికల్ ఎక్స్‌పర్ట్

By Mahesh KFirst Published Jan 11, 2022, 11:54 PM IST
Highlights

కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిపై ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ జయప్రకాశ్ సంచలన విషయాలు వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను ఏదీ ఆపలేదని, బూస్టర్ డోసు కూడా అడ్డుకోజాలదని వివరించారు. ఇది డెల్టా వేరియంట్ కంటే తీవ్రత తక్కువ ఉన్న వేరియంట్ అని దీన్ని మనం ఎదుర్కోవచ్చని చెప్పారు. అంటువ్యాధి పరిణామ క్రమాన్ని ప్రభావితం చేయలేమని, కరోనా వైరస్ గురించి ఇప్పుడు భయపడాల్సిన పని లేదని అన్నారు ఇది చివరకు సాధారణ జలుబు తరహా మిగిలి పోతుందని చెప్పారు.
 

న్యూఢిల్లీ: దేశమంతా భారీగా కరోనా కేసులు(Corona Cases) పెరగడం వెనుక ఉన్నట్టుగా భావిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌(Omicron Variant)ను ఏదీ ఆపలేదని ఓ వైద్య నిపుణుడు వెల్లడించాడు. ప్రతి ఒక్కరూ దీని బారిన పడాల్సిందేనని స్పష్టం చేశారు. బూస్టర్ డోసు(Booster Dose) దీన్ని ఆపలేదని వివరించారు. ఒమిక్రాన్ వ్యాప్తిలో బూస్టర్ డోసు ప్రభావం ఇసుమంత అయినా ప్రభావం చూపదని అన్నారు. బూస్టర్ డోసు వేసినా.. ప్రపంచమంతటా ఇది పాకుతూనే ఉన్నదని ఆందోళనకర విషయాన్ని తెలిపారు. అయితే, మరో ఉపశమనకర విషయమేంటంటే.. కొవిడ్ అంటే ఇక అంతలా భయపడాల్సిన పని లేదని వివరించారు. ఈ స్ట్రెయిన్‌తో హాస్పిటల్ చేరే వారి సంఖ్య తగ్గిందని అన్నారు. ఈ వైరస్‌ను మనం ఎదుర్కోగలమని వివరించారు. ఇది డెల్టా వేరియంట్ కంటే తేలికైన వేరియంట్ అని, కానీ, దీన్ని ఏదీ అడ్డుకోలేదని చెప్పారు.

అంటువ్యాధుల నిపుణుడు, ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ చైర్‌పర్సన్ డాక్టర్ జయప్రకాశ్ ములియిల్ ఒమిక్రాన్ వేరియంట్ పై సంచలన విషయాలు వెల్లడించారు. బూస్టర్ డోసు వేయాలని ఏ మెడికల్ బాడీ కూడా సూచించలేదని అన్నారు. ఈ బూస్టర్ డోసులు అంటువ్యాధి యొక్క సహజ పరిణామాన్ని అడ్డుకోజాలవని తెలిపారు. అంతేకాదు, కొవిడ్ పేషెంట్ క్లోజ్ కాంటాక్టు లక్షణాలు లేని వ్యక్తులకు టెస్టు చేయాల్సిన పని లేదనీ వాదించారు. ఈ వైరస్ రెండు రోజుల్లో రెట్టింపు మందికి సోకుతుందని అన్నారు. ఒక మనిషిలో వైరస్ ఉన్నదని గుర్తించే లోపలే వారు చాలా మందికి అంటించి ఉంటారని వివరించారు. కాబట్టి, మీరు టెస్టు చేసే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుందని తెలిపారు. ఒక అంటువ్యాధి దాని పరిణామ క్రమంలో మనమేమీ చేయలేమని వివరించారు. తాము ఇప్పటికీ బూస్టర్ డోసు వేయాలని ప్రభుత్వానికి సజెస్ట్ చేయలేదని తెలిపారు. తామే కాదే.. ఏ సైంటిఫిక్ బాడీ కూడా బూస్టర్ డోసు వేయాలని కోరలేదని వివరించారు. 60 ఏళ్లు పైబడిన కొందరిలో రెండు డోసుల టీకా వేసినప్పటికీ రోగ నిరోధక శక్తిలో మార్పు కనిపించట్లేవని కొన్ని కేసులు ముందుకు వచ్చాయని అన్నారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకునే ప్రికాషనరీ డోసు వేయాలనే సూచనలు వచ్చి ఉంటాయని వివరించారు.

మనలో చాలా మందికి ఇప్పటికీ కరోనా వైరస్ సోకి ఉంటుందని తెలిపారు. అంతేకాదు, సుమారు 80 శాతం మందికి తమకు కరోనా వైరస్ సోకిందనే విషయమే తెలియకపోవచ్చని అన్నారు. ఈ వేరియంట్ వేగంగా సోకుతూనే ఉందని, దాన్ని బూస్టర్ డోసు ఆపలేదని తెలిపారు. ఒక అంటు వ్యాధి క్రమంగా క్షీణిస్తుందని, ఇప్పుడు కరోనా వైరస్ కూడా డెల్టా వేరియంట్ అంతటి తీవ్రత ఇప్పుడు లేదని వివరించారు. ఒమిక్రాన్ వేరియంట్ తేకలిపాటి వేరియంట్ అని తెలిపారు. మనం దీన్ని ఎదుర్కోవచ్చని చెప్పారు. బూస్టర్ డోసు లేదా ఇతర అంశాలేవీ ఈ వేరియంట్‌ను సోకకుండా అడ్డుకోలేవని పేర్కొన్నారు. ఈ వేరియంట్ క్రమంగా క్షీణించి జలుబు తరహా మిగిలిపోతుందని చెప్పారు.

click me!