అశాంతితో నిర్భయ దోషులు: నిద్రపోలేదు, తినలేదు, స్నానానికి నిరాకరణ

By telugu teamFirst Published Mar 20, 2020, 10:25 AM IST
Highlights

ఉరికంబం ఎక్కక తప్పదని తెలిసిన తర్వాత నిర్బయ కేసు దోషులు నలుగురు రాత్రి అశాంతితో గడిపారు. నిద్ర పోలేదు. చివరిసారి ఆహారం తీసుకోవడానికి కూడా నిరాకరించారు. స్నానం కూడా చేయలేదు.

న్యూఢిల్లీ: శుక్రవారం ఉరికంబం ఎక్కడానికి ముందు రాత్రి నిర్భయ కేసు దోషులు అశాంతితో గడిపారు. వేర్వేరు గదుల్లో కొన్ని గంటల పాటు ఒంటరిగా గడిపారు. వారు చివరి కోరిక ఏదీ కోరలేదు. వీలునామాలు కూడా రాయలేదు. ఇక తాము ఉరికంబం ఎక్కక తప్పదని వారికి శుక్రవారం తెల్లవారు జామున 3.30 గంటలకు తెలిసిపోయింది. 

నలుగురు దోషులు కూడా అల్పాహారం తీసుకోవడానికి నిరాకరించారు. చివరిసారి వారికి పెట్టిన ఆహారం అదే. స్నానం చేయాలని సూచిస్తే వారు అందుకు నిరాకరించారు. వారు నిద్ర కూడా పోలేదు. జైలు వైద్యులు వారికి పరీక్షలు నిర్వహిచారు. 

Also Read: నిర్భయ దోషులకు ఉరి... దేశ చరిత్రలో తొలిసారిగా...

ఉరితీతను కేవలం ఐదుగురు వ్యక్తులు మాత్రమే చూశారు.  జైలు సూపరింటిండెంట్, డిప్యూటీ సూపరింటిండెంట్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్, జిల్లా మెజిస్ట్రేట్, మరో జైలు ఉద్యోగి మాత్రమే చూశారు. తలారి పవన్ జల్లాద్ నలుగురిని ఒకేసారి ఉరితీశాడు. 

దోషులు పవన్, వినయ్, ముకేష్ తీహార్ జైలులో కూలీపనులు చేశారు. వారు ఆర్జించిన సొమ్మును వారి కుటుంబాలకు పంపిస్తారు. అక్షయ్ ఠాకూర్ ఏ విధమైన పని కూడా చేయలేదు. దాంతో ఏమీ సంపాదించలేదు. వారికి సంబంధించిన వస్తువులను కూడా కుటుంబాలకు పంపిస్తారు.  

Also Read: నిర్భయ కేసులో 7 ఏళ్ల నిర్విరామ పోరాటం: ఎవరీ సీమ కుష్వాహా ?

నిర్భయ కేసు దోషులను నలుగురిని తీహార్ జైలులో శుక్రవారం ఉదయం సరిగ్గా 5.30 గంటలకు ఉరి తీశారు. పవన్ జలాద్ వారికి ఉరేశాడు. వారిని ఉరి తీయడానికి మూడు సార్లు కోర్టు డెత్ వారంట్ జారీ చేసింది. చివరకు మూడో డెత్ వారంట్ అమలైంది. దాదాపు ఏడున్నరేళ్ల తర్వాత నిర్భయ కేసు దోషులకు శిక్ష పడింది. 

ముకేష్ సింగ్  సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ (31)లకు ఉరి శిక్ష పడింది. ఈ నిర్భయ అత్యాచారం, హత్య కేసులో ఆరుగురు నిందితులు ఉండగా, ఒకతను మైనర్ కావడంతో శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. ప్రధాన నిందితుడు రామ్ సింగ్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు.

2012 డిసెంబర్ 16వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో ఆరుగురు వ్యక్తులు వైద్యవిద్యార్థినిపై అత్యాచారం చేసి, ఆమెను చిత్రహింసలు పెట్టారు. సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13 రోజుల తర్వాత 2012 డిసెంబర్ 29వ తేదీన ఆమె మరణించింది.

click me!