నిర్భయ కేసులో మరో ట్విస్ట్: చచ్చిపోతామని దోషుల తల్లిదండ్రుల బెదిరింపు

By telugu teamFirst Published Mar 16, 2020, 1:10 PM IST
Highlights

కారుణ్య మరణాలు పొందడానికి తమకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నిర్భయ కేసు దోషుల తల్లిదండ్రులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాశారు. నలుగురు దోషులను మార్చి 20వ తేదీన ఉరి తీయాలని కోర్టు డెత్ వారంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.

న్యూఢిల్లీ: కారుణ్య మరణాలు పొందేందుకు తమకు అనుమతి ఇవ్వాలని నలుగురు నిర్భయ కేసు దోషుల కుటుంబ సభ్యులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కోరారు. ఈ మేరకు వారు ఆదివారం రాష్ట్రపతికి ఓ లేఖ రాశారు. రాష్ట్రపతికి లేఖ రాసినవారిలో దోషుల తల్లిదండ్రులు, తోబుట్టువులు, పిల్లలు ఉన్నారు. 

తాము కారుణ్య మరణం పొందేందుకు అనుమతించాలని మిమ్మలను కోరుతున్నామని, బాధితురాలి తల్లిదండ్రులను కూడా కోరుతున్నామని, తద్వారా భవిష్యత్తులో నిర్భయ వంటి నేరాలను నిరోధించవచ్చునని వారు ఆ లేఖలో అన్నారు. కోర్టు కూడా ఒకరి స్థానంలో ఐదుగురిని ఉరి తీయాల్సిన అవసరం ఉండదని వారన్నారు. 

Also Read: క్షమాభిక్ష తిరస్కరణ ఎపిసోడ్‌తో కొత్త ఎత్తు: ఢిల్లీ హైకోర్టుకెక్కిన వినయ్ శర్మ

మన దేశంలో పెద్ద తప్పులు చేసిన వ్యక్తులకు కూడా క్షమాభిక్ష ప్రసాదించారని, ప్రతీకారం అధికారానికి నిర్వచనం కాదని, క్షమించడంలో కూడా అధికారం ఉందని వారన్నారు. వారు హిందీలో రాష్ట్రపతికి ఆ లేఖ రాశారు. 

నలుగురు నిర్భయ దోషులను మార్చి 20వ తేదీ ఉదయం 5.30 గంటలకు ఉరితీయాలని పాటియాల హౌస్ కోర్టు డెత్ వారంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ స్థితిలో రాష్ట్రపతికి రాసిన ఆ లేఖ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. దోషుల క్షమాభిక్ష పిటిషన్లను ఇప్పటికే రాష్ట్రపతి తిరస్కరించారు. 

Also Read: నిర్భయ కేసులో మరో ట్విస్ట్: పోలీసులపై కోర్టుకెక్కిన దోషి పవన్ గుప్తా

2012 డిసెంబర్ లో వైద్య విద్యార్థినిపై ఆరుగురు  అత్యాచారం చేసి, ఆమెను చిత్రహింసలకు గురి చేసిన విషయం తెలిసిందే. వారిలో ఒక్కడు మైనర్ కావడంతో అతను శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. మరొకతను జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు.

click me!