మరో ఎత్తుగడ: మెర్సీ పిటిషన్ తోసివేతపై సుప్రీంకెక్కిన నిర్భయ కేసు దోషి

By telugu teamFirst Published Jan 27, 2020, 2:56 PM IST
Highlights

రాష్ట్రపతి తన మెర్సీ పిటిషన్ ను తిరస్కరించడంపై నిర్భయ కేసు దోషి ముకేష్ కుమార్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. నిర్భయ కేసులో దోషులకు ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరిశిక్షను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

న్యూఢిల్లీ: తన మెర్సీ పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ నిర్భయ దోషి కేసు దోషి ముకేష్ కుమార్ సింగ్ సుప్రీంకోర్టుకు ఎక్కాడు. ఈ మేరకు అతను సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తన పిటిషన్ పై వెంటనే విచారణ చేపట్టాలని అతను కోరాడు. 

32 ఏళ్ల ముకేష్ కుమార్ సింగ్ మెర్సీ పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జనవరి 17వ తేదీన తిరస్కరించారు. ఒక వ్యక్తిని ఉరితీస్తున్నప్పుడు దానికన్నా ముఖ్యమైంది ఏం ఉంటుందని చీఫ్ జస్టిస్ ఎస్ఎ బోబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. 

Also Read: నిర్భయ దోషులు: 24 గంటల పాటు నిఘా, ఆత్మహత్య చేసుకోకుండా జాగ్రత్తలు

ఉరిశిక్షను ఫిబ్రవరి 1వ తేదీన అమలు చేస్తున్నప్పుడు, ఆ వ్యక్తికి సంబంధించిన విషయం అత్యంత ప్రధానమైందని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ లు కూడా ఉన్న సుప్రీం బెంచ్ వ్యాఖ్యానించింది. ఉరితీతను ఫిబ్రవరి 1వ తేదీన నిర్మయించినందున మెన్షనింగ్ ఆఫీసర్ ను కలవాలని మకేష్ సింగ్ తరఫు న్యాయవాదికి సూచించింది. ఉరితీత కేసుకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పింది. 

నిర్భయ కేసుకు సంబంధించిన నలుగురు దోషులను ఫిబ్రవరి 1వ తేదీన ఉరి తీయాలని కోర్టు డెత్ వారంట్ జారీ అయిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు క్యురేటివ్ పిటిషన్ ను తిరస్కరించిన తర్వాత ముకేష్ సింగ్ రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ పెట్టుకున్నాడు. మరో దోషి అక్షయ్ కుమార్ క్యురేటివ్ పిటిషన్ ను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 

Also Read: ఉరిశిక్షలో మరో ట్విస్ట్.. సుప్రీమ్ కోర్టుకు నిర్భయ నిందితుడు

మరో ఇద్దరు దోషులు పవన్ గుప్తా, వినయ్ కుమార్ శర్మ సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్లు దాఖలు చేసుకోవాల్సి ఉంది. 2012 డిసెంబర్ లో వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేసి, చిత్రహింసలు పెట్టి హత్య చేసిన కేసులో నలుగురికి ఉరిశిక్ష పడిన విషయం తెలిసిందే.

click me!