
బెంగళూరు: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, జేడీఎస్ అగ్రనేత హెచ్‌డీ కుమారస్వామి కొడుకు నిఖిల్ కుమారస్వామికి రాజకీయాలు అంతగా కలిసిరావడం లేదు. ఎన్నికల్లో వరుస ఓటములతో షాక్‌కు గురైన నిఖిల్ కుమారస్వామి.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ యువజన విభాగం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ ఓటమి అంతం కాదని.. పార్టీని మరింతగా నిర్మిస్తామని అని పేర్కొన్నారు. దయచేసి తనరాజీనామాను ఆమోదించాలని లేఖలో అభ్యర్థించారు. రాజీనామా లేఖను మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం ఇబ్రహీంలకు పంపారు.
అయితే నిఖిల్ కుమారస్వామి రాజీనామాను జేడీఎస్ ఆమోదిస్తుందా? లేదా? అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ నిఖిల్ రాజీనామాను ఆమోదిస్తే.. జేడీఎస్ యువజన విభాగం అధ్యక్ష పదవిని ఎవరికి అప్పగిస్తారనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పదవికి సంబంధించి దేవెగౌడ మరో కుమారుడు హెచ్‌డీ రేవణ్ణ తనయుడు ప్రజ్వల్ రేవణ్ణ పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఇందుకు కుమారస్వామి అంగీకరిస్తారా? అనేది ప్రశ్నగా మారింది. ఇందుకు కుటుంబ రాజకీయాలు అడ్డుపడే అవకాశం ఉందని జేడీఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ ఘోర ఓటమి పాలైంది. ఈ ఎన్నికల్లో జేడీఎస్ కేవలం 19 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. రామనగర నుంచి జేడీఎస్ తరఫున పోటీ చేసిన నిఖిల్ కుమారస్వామి కూడా ఓటమి పాలయ్యారు. గతంలో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మాండ్య నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన కుమారస్వామి.. సినీ నటి సుమలత చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.