ప్రవీణ్ నెట్టారు హత్య కేసు: కిల్లర్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసిన పీఎఫ్‌ఐ.. ఎన్‌ఐఏ చార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు..

By Sumanth KanukulaFirst Published Jan 21, 2023, 10:01 AM IST
Highlights

కర్ణాటకలో బీజేపీ యువమోర్చా నాయకుడు ప్రవీణ్ నెట్టారు హత్య కేసులో నిషేధిత రాడికల్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)తో సంబంధాలు ఉన్న 20 మందిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఛార్జిషీట్ దాఖలు చేసింది.

కర్ణాటకలో బీజేపీ యువమోర్చా నాయకుడు ప్రవీణ్ నెట్టారు హత్య కేసులో నిషేధిత రాడికల్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)తో సంబంధాలు ఉన్న 20 మందిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఛార్జిషీట్ దాఖలు చేసింది. గతేడాది జూలై 26న ప్రవీణ్ నెట్టారు దక్షిణ కన్నడలోని బెల్లారే గ్రామంలో హత్యకు గురయ్యారు. సమాజంలో భయాందోళనలు సృష్టించడం, ప్రజలలో భయాన్ని సృష్టించడం అనే ఉద్దేశ్యంతో ఈ హత్య చేసినట్టుగా ఎన్‌ఐఏ నివేదించింది. ఐపీసీలోని 120బీ, 153ఏ, 302, 34 సెక్షన్లు, చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం-1967లోని సెక్షన్లు 16, 18, 20, ఆయుధాల చట్టంలోని సెక్షన్ 25(1)(ఏ) కింద స్పెషల్ కోర్టులో ఎన్‌ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది.

సమాజంలో భీభత్సం, మతపరమైన ద్వేషం, అశాంతిని సృష్టించడం, 2047 నాటికి ఇస్లామిక్ పాలనను స్థాపించాలనే దాని అజెండాలో భాగంగా పీఎఫ్‌ఐ.. నిర్దేశించుకున్న లక్ష్యాలను చంపడానికి సర్వీస్ టీమ్స్, కిల్లర్ స్క్వాడ్స్ అనే రహస్య బృందాలను ఏర్పాటు చేసినట్టుగా చార్జ్‌షీట్‌లో పేర్కొంది. ‘‘బెంగళూరు నగరం, సుల్లియా టౌన్, బెల్లారే గ్రామంలో జరిగిన పీఎఫ్‌ఐ సభ్యులు, నాయకుల కుట్ర సమావేశాల కొనసాగింపులో.. నిర్దిష్ట కమ్యూనిటీకి చెందిన ప్రముఖ సభ్యుడిని గుర్తించి, వారిని లక్ష్యంగా చేసుకోవాలని జిల్లా సర్వీస్ టీమ్ అధినేత ముస్తఫా పైచర్ ఆదేశించారు’’ అని ఎన్‌ఐఏ తెలిపింది. 

‘‘సూచనల ప్రకారం.. 4 మంది వ్యక్తులను గుర్తించారు. వీరిలో ప్రవీణ్ నెట్టారుపై గతేడాది జూలై 26న బహిరంగంగానే మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశారు.  ప్రజలలో, ముఖ్యంగా ఒక నిర్దిష్ట సమాజంలోని సభ్యులలో భయాందోళనలను సృష్టించడానికి ఈ విధంగా చేశారు’’అని ఎన్‌ఐఏ పేర్కొంది.

20 మందిని ఎన్‌ఐఏ చార్జిషీట్‌లో పేర్కొనగా.. అందులో ఆరుగురు పీఎఫ్‌ఐ సభ్యులు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్నవారిలో..  ముస్తఫా పైచార్, మసూద్ కెఏ, కొడాజె మహమ్మద్ షెరీఫ్, అబూబక్కర్ సిద్దిక్, ఉమ్మర్ ఫరూక్ ఎంఆర్, తుఫైల్ ఎంహెచ్ ఉన్నారు. ఈ క్రమంలోనే వారి అరెస్టుకు దారితీసే సమాచారం కోసం ఎన్‌ఐఏ రివార్డులు ప్రకటించింది. వారిలో ఎవరిని పట్టించినా రూ.5 లక్షల నగదు బహుమతి ఇస్తామని చెప్పింది. 
 

click me!