ఘోరం.. పిల్లలు పుట్టడం లేదని.. మహిళను స్మశానంలో కూర్చోబెట్టి.. అస్థికలు తినిపించి...

By SumaBala BukkaFirst Published Jan 21, 2023, 9:43 AM IST
Highlights

భార్యకు పిల్లలు పుట్టడం లేదని ఓ భర్త, అత్తింటివారు అతి దారుణానికి ఒడిగట్టారు. ఆమెతో బలవంతంగా స్మశానంలో ఎముకలు తినిపించారు. 

మహారాష్ట్ర : ఓ మహిళకు పిల్లలు పుట్టక పోతే అది ఆమె ఒక్కదాని సమస్యగానే చూడడం..  ఆమెలోనే లోపం ఉన్నట్టుగా వ్యవహరించడం..  సమాజంలో అత్యంత సహజంగా కనిపిస్తోంది.  భార్యాభర్తలిద్దరిలో ఎవరిలో లోపం ఉన్నా పిల్లలు పుట్టారన్న సంగతి తెలిసినా.. మహిళనే బాధితురాలిగా చేస్తారు. గుళ్ళు గోపురాలు తిప్పుతూ, పూజలూవ్రతాలు అంటూ..  పూజారుల దగ్గరికి, డాక్టర్ల దగ్గరికి పరుగులు పెట్టిస్తారు. ఈ క్రమంలో ఆ మహిళను మానసికంగా కృంగదీస్తారు. అలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చేవి కొన్ని అయితే.. వెలుగులోకి రానివి వేల సంఖ్యలో ఉంటాయి. మహారాష్ట్రలో ఒళ్ళుగగుర్పొడిచే ఇలాంటి అమానవీయ ఘటన చోటుచేసుకుంది. 

ఓ వివాహితకు పిల్లలు పుట్టడం లేదని ఏకంగా ఆమె చేత ఎముకలు తినిపించారు. ఈ దారుణమైన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పుణె, ధైరీ ప్రాంతంలోని సింహ ఘాట్ రోడ్డు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ జుగుస్సాకరమైన ఘటన జరిగింది. సంతానం కలగడం లేదని బాధిత మహిళను భర్తతోపాటు, కుటుంబ సభ్యులు కొంతకాలంగా శారీరకంగా, మానసికంగా తీవ్ర హింసలకు గురి చేస్తున్నారు.

క్షణికావేశంలో భార్య గొంతుకోసిన భర్త.. ఆ తరువాత ఇంటికి నిప్పు పెట్టి...

పిల్లలు పుట్టాలని ఆమెపై ఓ మాంత్రికుడుతో క్షుద్ర పూజలు కూడా చేపించారు. అతను నరబలి, జంతుబలులు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఆ మహిళను స్మశానంలోకి తీసుకువెళ్లి.. అక్కడ కూర్చోబెట్టి.. ఆమెతో అస్థికలు తినిపించారు. చదువుతుంటేనే రోమాలు నిక్కబడుచుకునే ఈ ఘటన తరువాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమె ఫిర్యాదు మేరకు పూణేకు చెందిన భర్త, అత్తమామలతో పాటు ఎనిమిది మందిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 

ఘటనపై మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రూపాలీ చకంకార్ కూడా తీవ్రంగా స్పందించారు. ఇంతటి దారుణానికి ఒడికట్టిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ ఘటనపై వెంటనే నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు.

click me!