ఫుల్వారీ షరీఫ్ పీఎఫ్‌ఐ కేసులో మరోకరిని అరెస్ట్ చేసిన ఎన్‌ఐఏ.. వెలుగులోకి కీలక విషయాలు..!!

By Sumanth KanukulaFirst Published Mar 19, 2023, 4:16 PM IST
Highlights

పీఎఫ్‌ఐకి చెందిన ఫుల్వారీ షరీఫ్ మాడ్యూల్‌పై అణిచివేతలో భాగంగా బిహార్‌లో మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్టుగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఆదివారం తెలిపింది. 

పీఎఫ్‌ఐకి చెందిన ఫుల్వారీ షరీఫ్ మాడ్యూల్‌పై అణిచివేతలో భాగంగా బిహార్‌లో మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్టుగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఆదివారం తెలిపింది. అరెస్ట్ చేసిన నిందితుడి పేరు ఎండీ ఇర్షాద్ ఆలం అని .. అతడు తూర్పు చంపారన్ జిల్లా అని పేర్కొంది. బీహార్ పోలీసుల సహాయంతో శనివారం పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ నుంచి ఇర్షాద్ ఆలంను పట్టుకున్నట్లు ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘పరిశోధనాత్మక లీడ్స్‌ను అనుసరిస్తూ గతేడాదిసెప్టెంబర్ 27న పీఎఫ్‌ఐపై నిషేధం విధించినప్పటికీ.. దాని నాయకులు/కార్యకర్తలు హింసాత్మక తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తూనే ఉన్నారు. నేరాలకు పాల్పడేందుకు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా ఏర్పాటు చేసుకుంటున్నారని ఎన్‌ఐఏ కనుగొంది’’ అని ఆ ప్రకనటలో పేర్కొంది. 

‘‘2022 జూలైలో నమోదైన కేసుకు సంబంధించి సంబంధించి ఈ అరెస్ట్ జరిగింది. అప్పుడు ఫుల్వారీ షరీఫ్ ప్రాంతంలో శిక్షణ కోసం గుమిగూడి తీవ్రవాద, హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని నలుగురు నిందితులను అరెస్టు చేయడం జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు’’ అని తెలిపింది. ఫుల్వారీ షరీఫ్, మోతిహారీలలోని పీఎఫ్‌ఐ కార్యకర్తలు రహస్య పద్ధతిలో పీఎఫ్‌ఐ కార్యకలాపాలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారని.. తూర్పు చంపారన్‌లో ‘‘ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన యువకుడిని’’ నిర్మూలించడానికి ఇటీవల తుపాకీలు, మందుగుండు సామగ్రిని కూడా సేకరించారని ఎన్‌ఐఏ పేర్కొంది.

‘‘మత ఉద్రిక్తతలను వ్యాప్తి చేసే లక్ష్యంతో సోషల్ మీడియాలో వీడియోలు పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పీఎఫ్‌ఐ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ యాకూబ్ ఖాన్‌తో ఇర్షాద్ ఆలం సన్నిహితంగా ఉన్నాడు. లక్ష్యంగా చేసుకున్న హత్యను అమలు చేసేందుకు యాకూబ్, ఇర్షాద్ ఆలం, ఇతర సహచరులతో కలిసి ప్లాన్ చేశాడు.  రెక్కీ నిర్వహించి ఆయుధాలను సేకరించారు’’ అని ఎన్‌ఐఏ  తెలిపింది. ఇదిలా ఉంటే.. ఈ కేసుకు సబంధించి ఇప్పటివరకు అరెస్టయిన నిందితుల సంఖ్య 13కి చేరిందని ఎన్‌ఐఏ తెలిపింది. ఈ ఏడాది జనవరిలో నలుగురిపై చార్జిషీట్ దాఖలు చేసినట్టుగా పేర్కొంది.

click me!