ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్‌పై ఆప్, బీజేపీ మధ్య వార్.. అమెరికన్ న్యూస్ పేపర్ ఎన్‌వైటీ ఏమన్నదంటే?

By Rajesh KFirst Published Aug 19, 2022, 10:17 PM IST
Highlights

ఢిల్లీ విద్యా విధానం పై న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం కేంద్రంగా బీజేపీ, ఆప్ మధ్య వాగ్వాదం జరిగింది. తమ కృషిని అంతర్జాతీయ మీడియా గుర్తిస్తున్నదని అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తావించగా.. అది డబ్బులు చెల్లించి రాయించుకున్న కథనంం అని బీజేపీ ఆరోపణలు చేసింది. ఈ తరుణంలో న్యూయార్క్ టైమ్స్ స్పందించి వివరణ ఇచ్చింది.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎడ్యుకేషన్ మోడల్‌పై, మంచి విద్యను అందించడానికి ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్న కృషి గురించి అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక ది న్యూయార్క్ టైమ్స్ ఓ ఫ్రంట్ పేజీ కథనం ప్రచురించింది. ఈ కథనం కేంద్రంగా ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం సాగింది. వీరిమధ్య వార్ జరుగుతుండగానే ఆ న్యూయార్క్ టైమ్స్ పత్రిక రెస్పాండ్ అయింది.

తమ ప్రభుత్వం విద్యా రంగంలో చేస్తున్న కృషిని కొనియాడుతూ అమెరికాలోని అతిపెద్ద పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఫ్రంట్ పేజీ కథనం రాసిందని అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు తమ కృషిని మెచ్చుకుంటూ ఉండగా కేంద్ర ప్రభుత్వం మాత్రం గిఫ్ట్‌గా సీబీఐని పంపిందని విమర్శించారు. ఈ రోజు సీబీఐ ఢిల్లీ ఎక్సైజ్ మినిస్టర్ మనీష్ సిసోడియా నివాసంలో తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే.

కాగా, అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలను బీజేపీ కొట్టిపారేసే ప్రయత్నం చేసింది. అరవింద్ కేజ్రీవాల్ డబ్బులు ఇచ్చి ఆ కథనం రాయించారని బీజేపీ ఐటీ ఇన్చార్జీ అమిత్ మాల్వియా ఆరోపించారు. ఢిల్లీ ఎడ్యుకేషన మోడల్‌ను రెరండు అంతర్జాతీయ పత్రికలు ఒక్క పదం కూడా పొల్లు పోకుండా ప్రచురించాయని, ఇవి ప్రకటనలు కాక మరేమిటీ? అంటూ ఆరోపణలు చేశారు. న్యూయార్క్ టైమ్స్, ఖలీజ్ టైమ్స్ ఎలా ఒకే ఆర్టికల్‌ను ఒక్క పదం కూడా మార్చకుండా ప్రచురిస్తాయని ప్రశ్నించారు.

ఈ వాదోపవాదాలు జరుగుతుండగా న్యూయార్క్ టైమ్స్ ప్రతినిధి జాతీయ మీడియా ఇండియా టుడేతో దీనిపై స్పందించారు. ఢిల్లీ విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి చేస్తున్న కృషిపై తాము ప్రచురించిన కథనం నిష్పక్షపాతమైనదని, గ్రౌండ్ రిపోర్టింగ్ ఆర్టికల్ అని వివరించారు. న్యూయార్క్ టైమ్స్ ఏళ్ల తరబడి విద్యా గురించి రిపోర్ట్ చేస్తూ ఉన్నదని తెలిపారు. న్యూయార్క్ టైమ్స్ ప్రచురించే కథనాలు స్వతంత్రమైనవని, రాజకీయాలకు, ప్రభావాలకు అతీతమైనవని స్పష్టం చేశారు. ఇతర వార్తా సంస్థలు తమ దగ్గర నుంచి ఆ కథనాలను, తమ కవరేజీని ప్రచురించడానికి లైసెన్సు తీసుకుంటూ ఉంటాయని వివరించారు.

click me!