కాన్వాయ్‌పై కోడిగుడ్లు, నల్లజెండాలతో నిరసనలు .. గాంధీని చంపినవాళ్లు నన్ను వదులుతారా : సిద్ధరామయ్య వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Aug 19, 2022, 8:48 PM IST
Highlights

తన కాన్వాయ్‌పై కోడిగుడ్లు విసరడం, నల్లజెండాలతో నిరసనలు తెలపడంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాంధీని చంపిన వారు తనను మాత్రం ఎందుకు వదులుతారని ఆయన ప్రశ్నించారు. 
 

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న కొడుగు పర్యటనకు వెళ్లిన ఆయన కాన్వాయ్‌పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లు విసరడంతో పాటు నల్లజెండాలు ప్రదర్శించి ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు ఓ వ్యక్తి సిద్ధూపై సావర్కర్ ఫోటోను కూడా విసిరికొట్టాడు. దీని నుంచి ఎలాగోలా బయటపడిన సిద్ధరామయ్య.. తన భద్రతను ఉద్దేశిస్తూ శుక్రవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాంధీని చంపిన వాళ్లు తనను మాత్రం వదులుతారా అంటూ వ్యాఖ్యానించారు. గాంధీని చంపిందీ వాళ్లేనని.. గాంధీ ఫోటోను వాడుకునేదీ వాళ్లేనంటూ సిద్ధూ సీరియస్ అయ్యారు. 

మరోవైపు ఈ వ్యవహారంపై కాంగ్రెస్ శ్రేణుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర స్పందించారు. ఆందోళనకు తాము వ్యతిరేకం కాదని.. కానీ చట్టాన్ని అదుపులోకి తీసుకోవాలని అనుకుంటే మాత్రం క్షమించేది లేదని హెచ్చరించారు. అయితే ప్రతిపక్షనేత చెబుతున్న మాటలు నమ్మేలా లేవని.. అలాగే సిద్ధరామయ్యకు భద్రతను కట్టుదిట్టం చేయాలని పోలీస్ శాఖను ఆదేశించినట్లు జ్ఞానేంద్ర చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని హోంమంత్రి ఆరోపించారు. 

ఇకపోతే.. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని క‌ర్నాట‌క ప్ర‌భుత్వం ప్ర‌చురించిన ప్రకటనపై సిద్ధరామయ్య తీవ్రంగా స్పందించారు. స్వాతంత్య్ర‌ సమరయోధుల జాబితా నుండి భార‌త దేశ మొద‌టి ప్ర‌ధాని, స్వాత‌త్య్ర స‌మ‌ర‌యోధులు జవహర్‌లాల్ నెహ్రూ పేరును తొలగించినందుకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. " నేటి ప్రభుత్వ ప్రకటనలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూను స్వాతంత్య్ర‌ సమరయోధుల జాబితాలో చేర్చకపోవడం, తన కుర్చీని కాపాడుకోవడానికి ఒక ముఖ్యమంత్రి ఎంత దిగజారిపోతాడో చూపిస్తుంది" అని మాజీ ముఖ్యమంత్రి  సిద్ద‌రామ‌య్య  అన్నారు. 

ALso REad:చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ, ఆరెస్సెస్.. : కాంగ్రెస్ నాయ‌కుడు సిద్ధరామయ్య

సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శ‌లు గుప్పించిన ఆయ‌న.. ‘‘పండిట్ నెహ్రూను అవమానించినందుకు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై యావత్ దేశానికి క్షమాపణలు చెప్పాలి. తమ దేశ తొలి ప్రధానిని కించపరిచే వారిని భారతదేశం, కర్ణాటక ప్రజలు ఎన్నటికీ అంగీకరించరు” అని సిద్ధరామయ్య అన్నారు. "తనను జైలు నుండి విడుదల చేయమని బ్రిటిష్ అధికారులను వేడుకున్న సావర్కర్ ముందు వరుసలో స్థానం పొందాడు. కానీ, అణగారిన వర్గాల గొంతుకగా నిలిచి స్వాతంత్య్రం కోసం పోరాడిన బాబా సాహెబ్‌ను చివరి వరుసలో ఉంచారు’’ అని ప్రభుత్వ ప్రకటన నేప‌థ్యంలో విమ‌ర్శ‌లు గుప్పించారు. బ్రిటీష్ అధికారులను వేడుకున్న సావర్కర్‌ను తప్పించి, తన మనుగడ కోసం వారికి తొత్తులుగా వ్యవహరించిన సావర్కర్‌ను మినహాయించి ఆర్‌ఎస్‌ఎస్‌లో స్వాతంత్య్ర సమరయోధునిగా చూపించడానికి ఎవరూ లేరని బొమ్మై ప్రభుత్వ ప్రకటన స్పష్టంగా చూపిస్తుంది” అని సిద్ధరామయ్య సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

click me!