
న్యూఢిల్లీ: కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా కిరణ్ రిజిజు స్థానాన్ని అర్జున్ రామ్ మేఘవాల్ భర్తీ చేశారు. న్యాయ శాఖ నూతన మంత్రిగా అర్జున్ రామ్ మేఘవాల్‌ను మోడీ ప్రభుత్వం ఎంచుకుంది. త్వరలో కేంద్ర మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ ఉంటుందనే వాదనలను ఈ నిర్ణయం తోసిపుచ్చిందని పలువురు చెబుతున్నారు. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్ రామ్ మేఘవాల్‌ను కేంద్ర మంత్రిగా ఎంచుకున్నారనే వాదనలూ వస్తున్నాయి.
కిరణ్ రిజిజు పలుమార్లు న్యాయవ్యవస్థతో వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కొలీజియం వ్యవస్థపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొలీజియం వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సహా పలువురు న్యాయమూర్తులు స్పందించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అర్జున్ రామ్ మేఘవాల్ న్యాయవ్యవస్థ, ప్రభుత్వం మధ్యం ఉండే సంబంధం పై ఫస్ట్ కామెంట్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘నా పై విశ్వాసం ఉంచింనందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు. మనం తెలుసుకోవాల్సిన ప్రతి విషయాన్ని రాజ్యాంగం మనకు బోధిస్తుంది. నేను దానికి అనుగుణంగానే పని చేస్తాను’ అని ఆయన ఎన్డీటీవీతో అన్నారు. న్యాయవ్యవస్థపై తరుచూ కామెంట్ చేసినందుకే కిరణ్ రిజిజును అర్థంతరంగా వేరే శాఖకు బదిలీ చేశారా? అని ప్రశ్నించగా ‘కానే కాదు’ అని అన్నారు. అలాగే, తన ఎంపికకు రాజస్తాన్ ఎన్నికలకు సంబంధం లేదనీ స్పష్టం చేశారు.
Also Read: Titanic Ship: టైటానిక్ షిప్ శకలాల 3డీ స్కాన్ చిత్రాల వెల్లడి.. మైండ్ బ్లోయింగ్ పిక్స్ ఇవే
శాసన వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఈ సంబంధాలు ఇకపైనా సన్నిహితంగానే, రాజ్యాంగబద్ధంగానే ఉంటాయి. సరిహద్దులు ఇప్పటికే అక్కడ ఏర్పాటు చేయబడి ఉన్నాయి’ అని అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు.
కిరణ్ రిజిజును న్యాయ శాఖ నుంచి తక్కువ ప్రాధాన్యముండే ఎర్త్ సైన్సెస్‌కు పంపించారు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి మూడు సార్లు లోక్‌సభకు ఆయన ఎన్నికయ్యారు. 2021 జులై 7వ తేదీన ఆయన న్యాయ శాఖకు బాధ్యతలు తీసుకున్నారు. అంతకు ముందు రవి శంకర్ ప్రసాద్ ఈ బాధ్యతల్లో కొనసాగారు.