ఇంటర్నేషనల్ ప్యాసింజర్లకు కొత్త రూల్స్.. భారత్‌లోకి వచ్చే వారికి సడలింపులు

By Mahesh KFirst Published Nov 22, 2022, 12:54 PM IST
Highlights

విదేశాల నుంచి భారత్‌లోకి వచ్చే విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ వెల్లడించింది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల నుంచి కొవిడ్ స్టేటస్ సెల్ఫ్ డిక్లరేషన్‌ను సడలించింది. ఎయిర్ సువిధ పోర్టల్‌లో ఇక పై కొవిడ్ స్టేటస్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది.
 

న్యూఢిల్లీ: భారత్‌లోకి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్రం కొత్త రూల్స్‌ను వెల్లడించింది. ఎయిర్ సువిధ ఫామ్స్ నుంచి మినహాయింపు ఇచ్చింది. మన దేశంలోకి వచ్చే ఇంటర్నేషనల్ ప్యాసింజర్లు ఇంతకాలం స్వయంగా కరోనా వ్యాక్సినేషన్ ఫామ్స్ ఫిల్ చేసి ఎయిర్ సువిధ పోర్టల్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంది. కానీ, ఈ నిబంధనను సడలిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ ఓ ప్రకటననలో పేర్కొంది.

నిన్న సాయంత్రం సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ జారీ చేసిన ఓ నోటీసులో ఇలా ఉన్నది. ‘కరోనా ఉధృతి మందగించిన, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌లో కీలక ముందడుగు పడిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ దేశంలోకి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు నిబంధనలను సవరించింది’ అని కేంద్ర పౌర విమానయాన శాఖ పేర్కొంది. నిన్న అర్ధరాత్రి నుంచే ఈ నిబంధనలు అమల్లోకి రాబోతున్నట్టు వివరించింది.

ఈ సవరించిన నిబంధనల్లో భాగంగా ఆన్‌లైన్ ఎయిర్ సువిధ పోర్టల్‌లో సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పణ చేసే నిబంధనను ఎత్తేసినట్టు వివరించింది. అయితే, కరోనా పరిస్థితులను బట్టి మళ్లీ ఈ నిర్ణయాన్ని సమీక్షించే అవకాశాలూ ఉంటాయని తెలిపింది. 

Also Read: Omicron: విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు 7 రోజుల తప్పనిసరి క్వారంటైన్.. నిబంధనలు సవరించిన కేంద్రం

కేంద్ర పౌర విమానయాన శాఖకు చెందిన ఎయిర్ సువిధ పోర్టల్‌లో ఇండియాకు వచ్చే ప్రయాణికులు తప్పకుండా తమ కరోనా వ్యాక్సినేషన్ స్టేటస్ పై స్వయంగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉండింది. అందులో ప్రయాణికులు తాము ఎన్ని డోసులు వేసుకున్నది? ఏ రోజుల్లో వేసుకున్నది తేదీలతో సహా నమోదు చేయాల్సి ఉంది. ఇప్పుడు ఈ నిబంధనను ఎత్తేసింది.

నిబంధన ఎత్తివేసినప్పటికీ ప్రయాణికులు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని కేంద్రం తెలిపింది. అలాగే, ఎయిర్‌పోర్టుల్లో మాస్కుల వినియోగం, భౌతిక దూరం పాటించడం కూడా ఎప్పటిలాగే పాటించాలని సూచనలు చేసింది.

విమాన ప్రయాణికులకు మాస్కు ధరించడం తప్పనిసరి కాదని గత వారం కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపింది. కానీ, కరోనా వైరస్ ముప్పును తప్పించుకోవడానికి వీటిని పాటించడం ఉత్తమం అని వివరించింది. ఈ ఆదేశాలు గత వారం వచ్చే వరకు మాస్క్ ధరించడం విమాన ప్రయాణికులకు తప్పనిసరిగా ఉండేది.

click me!