
న్యూఢిల్లీ: నూతన పార్లమెంటు భవనం ఈ నెల 28న ప్రారంభం కానుంది. ఈ పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడానికి షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్య చేశారు. నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభించకూడదని, దాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని తెలిపారు.
‘నూతన పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలే.. కానీ, ప్రధానమంత్రి కాదు’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నూతన పార్లమెంటు భవనాన్ని ఈ నెల 28వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం ప్రధాని మోడీని కలిశారు. నూతన పార్లమెంటు ప్రారంభ కార్యక్రమానికి విచ్చేయాలని, ఆ భవనాన్ని ప్రారంభించాలని కోరినట్టు లోక్‌సభ సెక్రెటేరియట్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
నూతన పార్లమెంటు భవనంలోని లోక్‌సభ చాంబర్‌లో సౌకర్యవంతంగా 888 మంది సభ్యులు కూర్చోవచ్చు. అదే రాజ్యసభ చాంబర్‌లో 300 మంది కూర్చోవచ్చు. ఒక వేళ రెండు సభల సభ్యులు కూర్చోవాలనుకుంటే.. మొత్తం 1,280 మంది సభ్యులు లోక్‌సభ చాంబర్‌లో కూర్చునే వీలు ఉన్నది.
2020 డిసెంబర్ 10వ తేదీన నూతన పార్లమెంటు భవన నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఈ భవనం స్వల్ప సమయంలో ఎన్నో హంగులతో నిర్మితమైందని లోక్‌సభ సెక్రెటేరియట్ తెలిపింది.
ఈ వార్తలు రాగానే సోషల్ మీడియాలో రాజకీయం రగిలింది. నూతన పార్లమెంటు భవనం ప్రధాని మోడీ తనకు తాను ప్రతిష్టను పెంచుకునే ఒక ప్రాజెక్టు అని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రతిపక్షాల మైక్రోఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తున్నప్పుడు ఇలాంటి కొత్త భవనంతో వచ్చే ప్రయోజనం ఏమిటీ అని ప్రశ్నించింది. అలాగే.. పార్లమెంటు అంటే ఒక భవంతి కాదని, అది నిస్సహాయుల పక్షాన వినిపంచే ఒక గళం అని పేర్కొంది.