కాంగ్రెస్ లేకుండా విపక్షాల కూటమి!.. 2024కు ముందు కొత్త ఫ్రంట్: దీదీతో భేటీ తర్వాత అఖిలేశ్ యాదవ్ ప్రకటన

By Mahesh KFirst Published Mar 17, 2023, 8:08 PM IST
Highlights

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఈ రోజు సాయంత్రం బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో ఆమె నివాసంలో సమావేశమయ్యారు. 2024కు ముందే కొత్త ఫ్రంట్ ఏర్పడుతుందని అఖిలేశ్ యాదవ్ ఆ తర్వాత ప్రకటించారు. ఈ నెల 23వ తేదీన మమతా బెనర్జీ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ను కలువబోతున్నారు.
 

కోల్‌కతా: 2024 లోక్ సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లేకుండా ప్రతిపక్షాల కూటమి ఒకటి ఏర్పడుతుందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఈ రోజు ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం ఆయన మమతా బెనర్జీతో సమావేశం అయ్యారు. ఆ భేటీ అనంతరం, ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం.

‘మీరు దీన్ని ఫ్రంట్ అని పిలవండి, గట్‌బందన్ అనుకోండి, కూటమి అనే పిలుచుకోండి. కానీ, ఎన్నికలకు ముందు ఒక కూటమి ఏర్పడుతుంది. ఎందుకంటే.. ప్రతి ఒక్కరూ మార్పునే కోరుకుంటున్నారు’ అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. అయితే, థర్డ్ ఫ్రంట్ కూటమిపై అధికారిక ప్రకటన ఏమీ వెలువడలేదు.

माननीय राष्ट्रीय अध्यक्ष श्री अखिलेश यादव जी ने पार्टी के वरिष्ठ नेताओं के साथ पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी जी के आवास पर की शिष्टाचार भेंट। pic.twitter.com/i0cv6GqOTZ

— Samajwadi Party (@samajwadiparty)

తృణమూల్ కాంగ్రెస్ నేత సుదీప్ బందోపాధ్యాయ్ 2024 లోక్ సభ ఎన్నికల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో మరింత మంది భావ సారూప్య పార్టీలతో కలుస్తామని వివరించారు. ‘మార్చి 23వ తేదీన మమతా బెనర్జీ ఒడిశా సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్‌తో సమావేశం కానున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లతో సమదూరాన్ని పాటించేలా ఇతర విపక్ష పార్టీలతో ప్రణాళికలు చేస్తాం. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని చెప్పడం లేదు. కానీ, బీజేపీని ఎదుర్కొనే ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతాం’ అని ఆయన వివరించారు.

Also Read: పేపర్ లీక్‌పై వ్యాఖ్యలు.. గుజరాత్‌లో 13 సార్లు జరిగింది, మోడీని రాజీనామా అడగ్గలవా : సంజయ్‌కి కేటీఆర్ కౌంటర్

విపక్షాలకు కాంగ్రెస్ బాస్ అని భావించడం లోపభూయిష్టమైన ఆలోచన అని అన్నారు. ప్రతిపక్షాల నేతగా రాహుల్ గాంధీని బీజేపీ చూపించాలని అనుకుంటున్నదని, అది నరేంద్ర మోడీ గెలుపు అవకాశాలను పెంచుతుందని తెలిపారు.

click me!