నేతాజీ అస్థికలు వెనక్కి తేవాలి.. స్వతంత్ర భారతావనికి ఆయన ఇంకా తిరిగి రానేలేదు: నేతాజీ కుమార్తె

By Mahesh KFirst Published Aug 15, 2022, 4:25 PM IST
Highlights

నేతాజీ అస్థికలను వెనక్కి తేవాలని ఆయన కుమార్తె అనితా బోస్ ఫాఫ్ కోరారు. వాటిని వెనక్కి తీసుకురావడానికి జపాన్ ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. స్వతంత్ర దేశం కోసం చివరి వరకు పోరాడిని సుభాష్ చంద్రబోస్ స్వతంత్ర భారతావనిని చూడకుండానే కన్నుమూశాడని, కనీసం ఆయన అస్థికలనైనా స్వతంత్ర భారత దేశానికి తేవాలని అన్నారు.
 

న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన జీవితాన్ని దేశ స్వాతంత్ర్యం కోసం దారబోశాడని ఆయన కుమార్తె అనితా బోస్ ఫాఫ్ అన్నారు. దేశానికి విదేశీ పాలకుల నుంచి విముక్తి లక్ష్యం తప్పితే మరే ఆలోచన లేకుండా ఆయన జీవించారని తెలిపారు. అలాంటి వ్యక్తి జీవించి ఉన్నప్పుడు స్వతంత్ర భారతావనిపై అడుగు పెట్టలేకపోయినా.. కనీసం ఆయన అస్థికలైనా ఈ స్వేచ్ఛా దేశాన్ని చూడాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. నేతాజీ ఏకైక కుమార్తెగా ఆయన చిరకాల కోరిక తీర్చడం తన బాధ్యతగా తాను తలుస్తున్నట్టు పేర్కొన్నారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను వెనక్కి తేవాలని ఆమె కోరారు. అంతేకాదు, వాటి ఆధారంగా డీఎన్ఏ టెస్టు చేస్తూ నేతాజీ మరణం చుట్టూ అల్లుకున్న అనేక ఊహాత్మక కథనాలకు ఫుల్‌స్టాప్ పడుతుందని వివరించారు. 1945 ఆగస్టు 18న నేతాజీ మరణించలేదని వాదించే వారికీ, మరణించారని వాదించే వారికీ ఈ డీఎన్ఏ టెస్టు ఒక ఆధారంగా ఉంటుందని తెలిపారు. 

నేతాజీ అస్థికలు జపాన్‌లో రెంకోజీ ఆలయంలో భద్రపరచబడి ఉన్నాయని, వాటిని వెనక్కి తెచ్చుకోవడానికి నేతాజీ అస్థికలను పర్యవేక్షిస్తున్న ఆలయం, ఆ దేశం నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు అని ఆమె తెలిపారు.

ఇప్పటికీ దేశంలో నేతాజీని కొలుస్తారని, విగ్రహాలు ఏర్పాటు చేస్తుంటారని, మరెన్నో రూపాల్లో ఆయన జ్ఞాపకాలను సజీవంగా ఉంచడానికి ప్రయత్నాలు చేస్తారని వివరించారు. ఆయన అస్థికలను స్వదేశానికి తీసుకురావడానికి అందరూ తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. భారతీయులు, పాకిస్తానీలు, బంగ్లాదేశీయులు స్వేచ్ఛగా జీవిస్తున్నవారంతా నేతాజీ కుటుంబ సభ్యులేనని అన్నారు. తన సోదర సోదరీమణులకు సెల్యూట్ అని వివరించారు. నేతాజీని తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి తనకు మద్దతు ఇవ్వడానికి ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు.

click me!