కపుల్స్ మధ్య వాట్సాప్ చాట్ కారణంగా ఆరు గంటలు నిలిచిపోయిన విమానం.. ఏం జరిగిందంటే?

By Mahesh KFirst Published Aug 15, 2022, 3:07 PM IST
Highlights

ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగిన చాటింగ్ ఓ విమానం నిలిచిపోవడానికి కారణమైంది. ఆ అమ్మాయి.. అబ్బాయికి పంపిన మెస్సేజీని అబ్బాయికి సమీపంగా కూర్చున్న ఓ తోటి ప్రయాణికుడు చూశాడు. ఆయన ఆందోళనకు గురై విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో వారందిరినీ విమానం నుంచి దింపేశారు. తనిఖీలు చేశారు.
 

న్యూఢిల్లీ: ఓ జంట మధ్య జరిగిన వాట్సాప్ చాట్.. ఏకంగా ఓ విమానాన్ని ఆరు గంటలపాటు నిలిచేసేలా చేసింది. విమాన ప్రయాణికులు అందరినీ డీబోర్డ్ చేయడానికి కారణమైంది. విమానమంతా తనిఖీలు చేశారు. ఆ తర్వాత మళ్లీ ప్రయాణికులను లోనికి అనుమతించింది. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకుంది. 

ఒక అమ్మాయి.. ఒక అబ్బాయి ఇద్దరూ మంగళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అక్కడి నుంచి అబ్బాయి ముంబయికి వెళ్లాల్సి ఉన్నది. అమ్మాయి బెంగళూరు వెళ్లిపోవాల్సి ఉన్నది. మంగళూరు నుంచి ముంబయికి వెళ్లుతున్న ఇండిగో విమానాన్ని అబ్బాయి ఎక్కేశాడు. బెంగళూరు వెళ్లే విమానం కోసం అమ్మాయి ఎయిర్‌పోర్టులో వెయిట్ చేస్తున్నది. ఈ సమయంలో వారిద్దరూ వాట్సాప్‌లో చాట్ చేసుకున్నారు. చాలా సరదాగా వారి మధ్య చాటింగ్ జరిగినట్టు తెలుస్తున్నది.

అయితే, వారి మధ్య జరుగుతున్న చాటింగ్‌ను అబ్బాయికి సమీపంగా కూర్చున్న ఓ వ్యక్తి చూశాడు. వెంటనే ఆందోళన చెందాడు. విమాన సిబ్బందికి రిపోర్ట్ చేశాడు. అందరినీ విమానం నుంచి కిందికి దింపేశారు. సెక్యూరిటీపై వారు చాలా సరదాగా కామెంట్లు చేసుకుంటూ చాటింగ్ చేశారు. అందులో భాగంగా ఆ అమ్మాయి అబ్బాయికి ‘యూ ఆర్ ది బాంబ్’ అని టెక్స్ట్ చేసింది. ఈ మెస్సేజీ చూసి ఓ తోటి ప్రయాణికుడు హడలిపోయాడు.

ఆయన కంప్లైంట్ చేయడంతో సిబ్బంది.. ప్రయాణికులు అందరినీ కిందికి దింపేసింది. ఏవైనా పేలుడు పదార్థాలు, లేదా ఇతర హానికారక పదార్థాలు ఉన్నాయేమో అని తనిఖీలు చేశారు. అబ్బాయిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకుంది. 

దీంతో ఆ విమానం ఆరు గంటలపాటు ఆలస్యమైంది. తిరిగి వారందరినీ (185 మందిని) ఎక్కించుకుని సాయంత్రం 5 గంటలకు ముంబయికి వెళ్లిపోయింది. కానీ, ఆ అబ్బాయి మాత్రం పోలీసుల విచారణలో ఎక్కువ కాలం ఉండటంతో ఆ విమానాన్ని మిస్ కావాల్సి వచ్చింది. కాగా, ఆ అమ్మాయి కూడా తన బెంగళూరు ఫ్లైట్‌ను మిస్ అయింది.

మీడియాతో పోలీసులు మాట్లాడుతూ, వారిద్దరూ ఫ్రెండ్స్ అని వాట్సాప్‌లో పిచ్చాపాటిగా చాట్ చేసుకున్నారని వివరించారు. బయటి నుంచి ఓ వ్యక్తి వారి మెస్సేజీ చూడటంతో భయాందోళనలకు దారి తీశాయని తెలిపారు. ఫలితంగా మంగళూరు నుంచి ముంబయికి వెళ్లాల్సిన ఫ్లైట్‌ను నిలిపేయాల్సి వచ్చిందని వివరించారు. ఇండిగో ఫ్లైట్ అధికారుల ఫిర్యాదు మేరకు బాజ్పే పోలీసు పరిధిలో ఐపీసీలోని 505 1బీ, సీల కింద కేసు నమోదైంది.

click me!