నేతాజీ గురించిన ఆధారాలు ఎన్నో ఉన్నాయ్.. వచ్చి పరిశోధించుకోండి.. ఆహ్వానించిన తైవాన్

By Mahesh KFirst Published Jan 23, 2022, 8:27 PM IST
Highlights

నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ రోజు 125వ జయంతి వేడుకలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఫిక్కి నిర్వహించిన ఓ కార్యక్రమంలో తైవాన్ డిప్యూటీ ఎన్వాయ్ మాట్లాడారు. నేతాజీ ప్రయాణిస్తున్న విమానం 1945లో తైవాన్‌లోనే కూలిపోయినట్టు అనుమానాలు ఉన్నాయి. నేతాజీ గురించి, భారత స్వాతంత్ర్య ఉద్యమం గురించి ఎన్నో చారిత్రక ఆధారాలు, డాక్యుమెంట్లు తైవాన్ నేషనల్ ఆర్కైవ్‌లో ఉన్నాయని, వాటిని ఇండియన్ స్కాలర్లకు ఓపెన్ చేస్తామని తెలిపారు. ఇండియన్ స్కాలర్లు వాటిని పరిశోధించి ఎన్నో కీలక ఘట్టాల గురించి తెలుసుకోవచ్చునని చెప్పారు.
 

న్యూఢిల్లీ: తైవాన్‌(Taiwan)లో ఇప్పటికీ నేతాజీ సుభాష్ చంద్రబోస్(Netaji Subhash Chandra Bose) గురించిన చారిత్రాత్మక డాక్యుమెంట్లు(Historical Documents) ఎన్నో ఉన్నాయని ఆ దేశ డిప్యూటీ ఎన్వాయ్ వివరించారు. నేషనల్ ఆర్కైవ్స్‌లో ఆయనకు సంబంధించిన వివరాలు ఇంకా భద్రంగా ఉన్నాయని తెలిపారు. కాబట్టి, భారత పరిశోధకులు తైవాన్‌కు వచ్చి ఆ వివరాలను పరిశోధించుకోవచ్చునని ఆహ్వానించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రయాణిస్తున్న విమానం 1945లో తైవాన్‌లోనే కూలిపోయినట్టు భావిస్తున్నారు. నేతాజీ 125వ జయంతి సందర్భంగా ఫిక్కీ శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో  తైవాన్ డిప్యూటీ ఎన్వాయ్ ముమిన్ చెన్ పాల్గొని మాట్లాడారు.

భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇండియన్ స్కాలర్లను ఆహ్వానిస్తున్నామని ఆయన వివరించారు. నేతాజీ గురించి, భారత స్వాతంత్ర్య సమరం గురించి తైవాన్‌లో ఎన్నో చారిత్రక ఆధారాలు, డాక్యుమెంట్లు ఉన్నాయని పేర్కొన్నారు. నేతాజీ గురించి వివరాలు అందించే ఎన్నో ఫొటోలు, చారిత్రక దస్త్రాలు ఉన్నాయని ఆయన వివరించారు. భారత దేశానికి విముక్తి కల్పించడానికి ఆయన చేసిన పోరాటాల్లో సింహభాగం విదేశాల్లోనే ఉన్నదని తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ మొదలు, బర్మా, చైనా, తైవాన్, జపాన్, సింగపూర్, ఇతర యూరప్ దేశాలలో ఆయన పోరాటాలు జరిగాయని వివరించారు.

వీటి గురించి భవిష్యత్‌లో ఏమైనా చేయాలని భారత దేశ మిత్రులను కోరుతున్నారని ఆయన పేర్కొన్నారు. తమ దగ్గర నేషనల్ ఆర్కైవ్స్, డేటా బేస్ ఉన్నాయని తెలిపారు. 1930, 40లలో తైవాన్‌పైనా నేతాజీ ప్రభావం ఎక్కువగా ఉన్నదని, ఆ నాయకుడి ప్రస్థానం గురించి ఎంతో సమాచారాన్ని తెలుసుకోవచ్చునని భారత స్కాలర్లకు తెలుపుతున్నామని, వారికి ఈ నేషనల్ ఆర్కైవ్‌ను ఓపెన్ చేస్తామని వివరించారు.

తైవాన్ దేశం ఒకప్పుడు జపాన్‌లో అంతర్భగంగా ఉన్నది. జపాన్ నుంచి తైవాన్ విముక్తి పొందిన తర్వాత చియాంగ్ కె షేక్ తైవాన్‌ను పాలించాడు. అప్పటి నుంచి దాని వలసవాద చరిత్ర, నేతాజీ పర్యటన, మరణానికి సంబంధించిన రిపోర్టులనూ 1990 వరకు బహిర్గతం చేయలేదు. 1990లో తైవాన్ ప్రజాస్వామ్య దేశంగా అవతరించింది. తైవాన్, భారత్‌ల మధ్య ఎంతో గాఢమైన సంబంధాలు గతంలో ఉండేవని, 1990ల తర్వాత జన్మించిన వారికి ఆ విషయాలు తెలియకపోవచ్చునని పేర్కొన్నారు. అంతేకాదు, 1940లలో చియాంగ్ కె షేక్.. నేతాజీ గురించి తన డైరీలో కొన్ని వ్యాఖ్యలు ప్రత్యేకంగా రాసుకున్నాడనీ తెలిపారు. అంతటి ప్రభావం నేతాజీ వేశారని వివరించారు.

తమ దేశం ఇప్పుడు సంపూర్ణ ప్రజాస్వామ్యమని, తమకు ప్రత్యేక గుర్తింపు ఉన్నదని ఆయన తెలిపారు. ఎంతో మంది యువ పరిశోధకులు తైవాన్‌, ఇతర దేశాలకు మధ్య సంబంధాలపై రీసెర్చ్ చేస్తున్నారని వివరించారు. 

నేతాజీ ప్రయాణించిన ప్లేన్ 1945లో తైవాన్‌లో క్రాష్ అయిందని పేర్కొన్నారు. అప్పటి చారిత్రక దస్తావేజులు, ఫొటోలు భద్రంగా నేషనల్ ఆర్కైవ్‌లో ఉన్నాయని, కానీ, వాటిపై ప్రజల దృష్టి ఇంకా పడలేదని చెప్పారు. జపాన్ దేశం 1945 ఆగస్టు 15న సరెండర్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండు రోజులకు అంటే ఆగస్టు 17న సైగోన్ నుంచి బయల్దేరిన విమానం తైవాన్‌లోని తైపెయి సమీపంలో కూలిపోయింది. అదే విమానంలో నేతాజీ ప్రయాణించాడని చాలా మంది భావిస్తుంటారు. ఆ తర్వాత అతనని నన్మోన్‌లోని ఆర్మీ హాస్పిటల్ బ్రాంచ్‌లో చికిత్సకు అడ్మిట్ చేశారు.

click me!