Sharad Pawar: శరద్ పవార్ రాజీనామా పై అజిత్ పవార్ ఏమన్నారంటే?

By Mahesh KFirst Published May 2, 2023, 4:33 PM IST
Highlights

శరద్ పవార్ రాజీనామా అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ రాజీనామా చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న అజిత్ పవార్ స్పందించారు. దయచేసి శరద్ పవార్ తన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
 

ముంబయి: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ రాజీనామా నిర్ణయం అందరినీ షాక్‌కు గురి చేసింది. ఎలాంటి ముందస్తు సంకేతాలు లేకుండానే సడెన్‌గా ఈ డెసిషన్ ప్రకటించారు. దీంతో సొంత పార్టీ ఎన్సీపీ సహా రాజకీయ వర్గాలు ఖంగుతిన్నాయి. అజిత్ పవార్ బీజేపీతో చేతులు కలిపే ప్రయత్నాల్లో ఉన్నారనే వార్తలు వస్తున్న తరుణంలో శరద్ పవార్ తన రాజీనామా ప్రకటించారు. ఈ నిర్ణయంపై అజిత్ పవార్ స్పందించారు.

శరద్ పవార్ తన ఆత్మకథ రెండో ఎడిషన్ లోక్ మాజే సంగటి బుక్ ఆవిష్కరిస్తున్న కార్యక్రమంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. అజిత్ పవార్ కూడా ఆ కార్యక్రమంలో ఉన్నారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడారు. రాజీనామాపై ఎన్సీపీ కమిటీ నిర్ణయానికి శరద్ పవార్ కట్టుబడి ఉండాలని అన్నారు. అలాగే, దయచేసి రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ కమిటీ సభ్యులు బయటి వారు కాదని, ఎన్సీపీ ఫ్యామిలీకి చెందినవారేనని వివరించారు.

Also Read: ఎన్సీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న శరద్ పవార్.. అధికారిక ప్రకటన..

‘మనమంతా ఒక కుటుంబం. రాజీనామాపై ఎన్సీపీ కమిటీ నిర్ణయాన్ని శరద్ పవార్ కట్టుబడి ఉండాలి. ఏకగ్రీవంగా మేం ఒక కమిటీగా ఏర్పడతాం. కానీ, దయచేసి రాజీనామాను వెనక్కి తీసుకోండి. ఇది మా విజ్ఞప్తి’ అని అజిత్ పవార్ తెలిపారు.

‘‘రాజ్యసభలో నాకు మూడేళ్ల పదవీకాలం మిగిలి ఉంది. ఇక నుంచి ఎన్నికల్లో పోటీ చేయను. ఈ మూడేళ్లలో రాష్ట్రానికి, దేశానికి సంబంధించిన అంశాలపై ఎక్కువ దృష్టి సారిస్తాను. ఎలాంటి అదనపు బాధ్యతలూ తీసుకోను. నా రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది. మే 1, 1960. నిన్న మే డే జరుపుకున్నాం. ఈ సుదీర్ఘ రాజకీయ జీవితం తర్వాత ఎక్కడో ఒక్కచోట ఆగిపోవడం గురించి ఆలోచించాలి. అత్యాశతో ఉండకూడదు. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఎప్పుడూ ఒక పదవికి అతుక్కుపోయే స్థితిని తీసుకోను. మీకు ఇది కష్టంగా అనిపించొచ్చు. కానీ నేను ఎన్‌సీపీ చీఫ్ పదవి నుండి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను’’ అని శరద్ పవార్ చెప్పారు. శరద్ పవార్ తర్వాత ఎన్సీపీ అధ్యక్ష  బాధ్యతలు ఎవరూ చేపట్టనున్నారనే దానిపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

click me!