మాతృభాషలోనే బోధనతో అభ్యాసన శక్తి మెరుగు: మోడీ

By narsimha lodeFirst Published Aug 7, 2020, 11:34 AM IST
Highlights

 ఒకే దేశం, ఒకే విద్యా విధానం ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. కొత్త విద్యా విధానాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని ఆయన కోరారు. కొత్త జాతీయ విద్యా విధానంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం నాడు  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. 


న్యూఢిల్లీ: ఒకే దేశం, ఒకే విద్యా విధానం ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. కొత్త విద్యా విధానాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని ఆయన కోరారు. కొత్త జాతీయ విద్యా విధానంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం నాడు  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. 

ఈ విద్యా విధానం 21వ శతాబ్దపు భారత దేశమైన న్యూ ఇండియాకు పునాది అని ఆయన చెప్పారు. ఈ విధానం వల్ల యువతకు అవసరమైన విద్య, నైపుణ్యాలు అందించనున్నట్టుగా చెప్పారు. దేశ ప్రజలకు కొత్త, ఉత్తమ అవకాశాలను కల్పించేందుకు ఈ విద్యా విధానం దృష్టి పెట్టిందని ఆయన చెప్పారు.

ఇటీవల కాలంలో విద్యలో పెద్ద మార్పులు జరగలేదన్నారు. యువతలో విమర్శనాత్మక ఆలోచన, వినూత్న ఆలోచన సామర్ద్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తత్వశాస్త్రం, విద్య పట్ల అభిరుచి ఉంటే అది సాధ్యమౌతోందని మోడీ చెప్పారు.కొత్త ఆవిష్కరణల దిశగా యువత ఆలోచనలు సాగాలని ఆయన నొక్కి చెప్పారు. దేశంలోని మేధావులు నూతన విద్యా విధానంపై చర్చించాలని ఆయన కోరారు. 

దేశ విద్యార్ధులను ప్రపంచ పౌరులుగా మార్చాలన్నారు. అంతేకాదు ఆయా సంస్కృతిలో విద్యార్థులు పాతుకుపోవాలన్నారు. విద్యార్థులు మాట్లాడే భాష(మాతృభాష)లోనే పాఠశాలలో పాఠాలు నేర్పించే భాష ఒకేలా ఉంటే విద్యార్థుల్లో అభ్యాసన శక్తి మెరుగుపడుతోందన్నారు. ఈ మేరకు వీలైనంత త్వరగా మాతృభాషలో బోధించమని సిఫారసు చేసినట్టు ఆయన చెప్పారు. కనీసం ఐదో తరగతి వరకైనా మాతృభాషలో విద్యా బోధన జరగాలని ఆయన కోరారు.

విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులు చదువుకోవచ్చన్నారు. నూతన విద్యా విధానానికి తాను సంపూర్ణ మద్దతు  ఇస్తున్నట్టుగా చెప్పారు. ఈ విధానంపై నాలుగేళ్లుగా లక్షలాది మంది నుండి సలహాలు, సూచనలు స్వీకరించినట్టుగా ఆయన గుర్తు చేశారు.

30 ఏళ్ల తర్వాత కొత్త జాతీయ విద్యా విధానం అమల్లోకి రానుందని ఆయన చెప్పారు. కొత్త విద్యా విధానంతో విస్తృత ప్రయోజనాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. విస్తృత అధ్యయనం తర్వాత నూతన జాతీయ విద్యా విధానాన్నితీసుకొచ్చినట్టుగా మోడీ స్పష్టం చేశారు.

ఈ విద్యా విధానంపై ఆందోళన, అపోహలు వద్దని  ప్రధాని కోరారు. ఈ విధానంపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోందన్నారు. భవిష్యత్త లక్ష్యాలకు విద్యార్ధులను సిద్దం చేయడమే ఈ విద్యా విధానం  లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు.యువతలో విద్యానైపుణ్యాలు పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. 

click me!