Sharad Pawar: అజిత్ పవార్ వర్గం ఎన్నికల కమిషన్ లో 900 అఫిడవిట్లు దాఖలు చేసిందని పేర్కొన్న అభిషేక్ మను సింఘ్వీ.. చాలా అఫిడవిట్లు అవాస్తవాలేననీ, ఇందులో ఆఫీస్ బేరర్ల తప్పుడు అఫిడవిట్లు కూడా ఉన్నాయని ఆరోపించారు. అజిత్ వర్గంపై ఎన్నికల సంఘం కోర్టులో క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Nationalist Congress Party: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిన చీలిక మహారాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. అబ్బాయి బాబాయి మధ్య ముదిరిన వార్ తో ఎన్సీపీ రాజకీయం ఏ మలుపు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే అజిత్ పవార్ వర్గం ఎన్నికల కమిషన్ ముందు నకిలీ అఫిడవిట్లు దాఖలు చేసిందని ఆరోపిస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్సీపీ శరద్ పవార్ వర్గం సోమవారం ఎన్నికల సంఘాన్ని కోరింది.
జూలై ప్రారంభంలో శరద్ పవార్ పై తిరుగుబాటు చేసి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరడానికి రెండు రోజుల ముందు, అజిత్ పవార్ జూన్ 30 న పార్టీ పేరు, గుర్తుపై హక్కు కోరుతూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ఆ తర్వాత 40 మంది శాసనసభ్యుల మద్దతుతో తనను తాను పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. తాజాగా ఎన్సీపీ పార్టీ, గుర్తుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ముందు సోమవారం (నవంబర్ 20న) విచారణ జరిగింది. ఈ విచారణలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ఎమ్మెల్యే జితేంద్ర అవద్, ఎమ్మెల్సీ సునీల్ భూసార పాల్గొన్నారు. విచారణ అనంతరం సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అఫిడవిట్ విషయంలో అజిత్ పవార్ వర్గంపై సింఘ్వీ తీవ్ర ఆరోపణలు చేశారు.
అజిత్ పవార్ శిబిరం దాఖలు చేసిన నకిలీ అఫిడవిట్లను 24 కేటగిరీలుగా విభజించవచ్చని సింఘ్వీ పేర్కొన్నారు. ఇది అజిత్ పవార్ శిబిరం చేసిన పూర్తి, సిగ్గుమాలిన మోసం అని ఆయన ఆరోపించారు. సింఘ్వీ విలేకరులతో మాట్లాడిన సమయంలో పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ అక్కడే ఉన్నారు. శుక్రవారం కూడా విచారణ కొనసాగనుంది. ఈసీకి అధికార పరిధి ఉందని తాము చూపించామనీ, ఇలాంటి బహిరంగ ఫోర్జరీ, మోసాలపై క్రిమినల్ కేసులకు సిఫారసు చేయాలనీ, ఇది ఐపీసీ కింద వారి అధికారమని ఆయన అన్నారు. అజిత్ పవార్ శిబిరం దాఖలు చేసిన పిటిషన్ ను ఎన్నికల సంఘం కొట్టివేయాలని అన్నారు. దీంతో పాటు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి కేసుల్లో ఎన్నికల సంఘం పాక్షిక న్యాయ వ్యవస్థగా పనిచేస్తుందనీ, ఈ కేసును ప్రధాన ఎన్నికల కమిషనర్, తోటి ఎన్నికల కమిషనర్లు విచారిస్తారని తెలిపారు.