నన్ను వ్యతిరేకించిన వారి వల్లే.. పీసీసీ స్థాయికి: సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Jul 23, 2021, 06:54 PM IST
నన్ను వ్యతిరేకించిన వారి వల్లే.. పీసీసీ స్థాయికి: సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు

సారాంశం

పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం అమరీందర్ సింగ్ హాజరయ్యారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నేతలంతా ఒకే వేదికపైకి రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం తొంగిచూసింది.  

తనను వ్యతిరేకించిన వారే ఒక రకంగా తన ఉన్నతికి దోహదపడ్డారని అన్నారు పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ . పార్టీ పంజాబ్ యూనిట్ అధ్యక్షుడుగా సిద్ధూ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూడా కనిపించడంతో వీరిరువురి మధ్య సయోధ్య కుదిరిందనే అభిప్రాయానికి తావిచ్చింది. వారి ప్రసంగాలు సైతం అందుకు అనుగుణంగానే సాగాయి.

పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి మీడియాతో మాట్లాడిన సిద్ధూ.. ముఖ్యమంత్రితో భుజం భుజం కలిపి తాను పనిచేస్తానని స్పష్టం చేశారు. తనకు ఎలాంటి ఇగోలు లేవని వెల్లడించారు. విపక్షాలు ఏవైతే చెబుతున్నాయో దానికి భిన్నంగా కాంగ్రెస్ ఈరోజు కలిసికట్టుగా, ఐక్యంగా ఉంది అని సిద్ధూ అన్నారు. తాను పంజాబ్ పీసీసీ చీఫ్‌గా ఎన్నిక కావడానికి దారి తీసిన పరిణామాలపై సిద్ధూ మాట్లాడుతూ.. తనను వ్యతిరేకించిన వారే తన ఎదుగుదలకు కారణమయ్యారని వ్యాఖ్యానించారు.

ALso Read:సిద్ధూ ప్రమాణ స్వీకారానికి అమరీందర్.. ఒకే వేదికపై చిరునవ్వులు, కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం

కాంగ్రెస్ అనే మహాసముద్రంలో సిద్ధూ ఒక చిన్న కార్యకర్త అని, పార్టీకి కార్యకర్తలే గుండెకాయ అని అన్నారు. కార్యకర్తలతో తాను మమేకమవడం అంటే పంజాబ్ ఆత్మతో మమేకం కావడమేనని వ్యాఖ్యానించారు. అమరీందర్ సింగ్ సమక్షంలో సిద్ధూకు సన్మానం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖడ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి హరీష్ రావత్ తదితరులు పాల్గొన్నారు. 

దీనికి ముందు, పంజాబ్‌ భవన్‌లో 'టీ పార్టీ'కి అమరీందర్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సిద్ధూ, అమరీందర్ సింగ్ కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. పదవీ బాధ్యతలు చేపడుతున్నందున తప్పనిసరిగా రావాలంటూ మంగళవారంనాడు సీఎం అమరీందర్ సింగ్ నివాసానికి సిద్ధూ స్వయంగా వెళ్లి ఆయనను ఆహ్వానించారు. 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu