డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ: నవీన్ మొగ్గే కీలకం

First Published Aug 9, 2018, 8:47 AM IST
Highlights

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. అధికార ఎన్‌డీఏ అభ్యర్థిగా జేడీయూ ఎంపీ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్‌ ఎంపీ బి.కె.హరిప్రసాద్‌ పోటీలో ఉన్నారు. 

న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. అధికార ఎన్‌డీఏ అభ్యర్థిగా జేడీయూ ఎంపీ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్‌ ఎంపీ బి.కె.హరిప్రసాద్‌ పోటీలో ఉన్నారు. 

 గురువారం ఉదయం 11 గంటలకు రాజ్యసభలో పోలింగ్‌ జరగనుంది. కాంగ్రెస్‌ సభ్యుడు పి.జె.కురియన్‌ సభ్యత్వ కాలపరిమితి ముగిసిపోవండతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ పదవి జూలై 1వ తేదీ నుంచి ఖాళీగా ఉంది. సభలో బలం తమకే అనుకూలంగా ఉందని రాజ్యసభలో కాంగ్రెస్‌ సభాపక్ష ఉపనేత ఆనంద్‌ శర్మ అన్నారు.
 
కాంగ్రెస్‌ తన అభ్యర్థిని నిలబెట్టడంపై ప్రతిపక్షంలోని కొన్ని పార్టీలు అలిగినా చివరకు అందరూ హరిప్రసాద్‌కు మద్దతివ్వాలని నిర్ణయించాయి. ఎన్‌సీపీకి చెందిన వందనా చవాన్‌ను నిలబెట్టాలని కాంగ్రెస్‌ తొలుత భావించింది. అయితే బీజేడీ అధినేత నవీన్‌ పట్నాయక్‌ అభ్యంతరం చెప్పడంతో ఆగిపోయింది. అయినా కూడా నవీన్ పట్నాయక్  కాంగ్రెస్‌కు మద్దతుపై ఎటూ తేల్చడం లేదు. 

ఇటీవల లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా బీజేడీ వాకౌట్‌ చేసి బీజేపీకి సహాయపడింది. రాజ్యసభలోనూ ఎన్‌డీఏకు మద్దతివ్వనున్నట్లు సంకేతాలు పంపింది. శివసేన బీజేపీకి మద్దతు ప్రకటించింది. 

అన్నాడీఎంకే, బీజేడీ, టీఆర్‌ఎస్‌ మద్దతుపై బిజెపి ఆశలు పెట్టుకుంది. ఆ మూడు పార్టీలు మద్దతిస్తేనే ఎన్‌డీఏకు విజయానికి అవసరమైన 123 సీట్లు వస్తాయి. ఎవరైనా గైర్హాజరైతే కనీస మెజారిటీ మరింత తగ్గుతుంది. టీడీపీ ఇప్పటికే కాంగ్రెసుకు మద్దతు పలికింది. 

ఆప్‌, పీడీపీలు, డీఎంకే, వైసీపీ కూడా మద్దతిస్తే ప్రతిపక్షాల అభ్యర్థి బలం 118కు చేరుతుంది. తొమ్మిది మంది సభ్యులున్న బీజేడీ మద్దతు ఇవ్వకపోతే ఎన్‌డీఏ బలం కాంగ్రెస్‌ కన్నా తక్కువ అవుతుంది. అందువల్ల అంతా నవీన్ పట్నాయక్ వైఖరి మీదే డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జయాపజయాలు ఆధారపడి ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చురాజ్యసభకు 12 మంది నామినేట్‌ అయితే 8 మంది ఇప్పటికే బీజేపీలో చేరారు. 

click me!