కరోనా వ్యాక్సిన్‌: సీఎంలకు నవీన్ పట్నాయక్ లేఖ

By narsimha lodeFirst Published Jun 3, 2021, 11:00 AM IST
Highlights

 ఏకీకృత టీకాల కొనుగోలు విధానం కోసం  అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ఆయన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన లేఖ రాశారు. 
 

భువనేశ్వర్: ఏకీకృత టీకాల కొనుగోలు విధానం కోసం  అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ఆయన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన లేఖ రాశారు. దేశమంతా ఒక్కటై కరోనా మహమ్మారిని తరిమేద్దాం. ప్రజల ప్రాణాల్ని కాపాడుకుందాం. ఏకీకృత టీకాల కొనుగోలు విధానం పట్ల తీర్మానాలతో రాష్ట్రాలు ముందుకు రావాలని  తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అందరూ ముఖ్యమంత్రులకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పిలుపునిచ్చారు. 

కోవిడ్‌ టీకాల కోసం రాష్ట్రాల మధ్య పోరు తగదని హితవు పలికారు. ఈ మేరకు దేశ వ్యాప్తంగా పలువురు  ముఖ్యమంత్రులకు బుధవారం ఆయన లేఖలు రాశారు. రాజకీయ, ఇతర భేదాభిప్రాయాలకు అతీతంగా అందరం ఒక్కటై కరోనా మహమ్మారి పోరులో పాలుపంచుకుందామన్నారు. ఇంతకుముందు పలువురు ముఖ్యమంత్రులతో ఈ మేరకు ప్రత్యక్షంగా సంప్రదింపులు జరిపినట్లు లేఖలో పేర్కొన్నారు.కరోనా మహమ్మారితో గత ఏడాది నుంచి ప్రపంచం తల్లడిల్లుతోంది. రెండు దశల్లో ప్రపంచ ప్రజల్ని కరోనా బెంబేలెత్తించింది. మూడో దశ ముంచుకొస్తోందనే ఆందోళన  మరింతగా భయపెడుతోంది. పెద్ద దిక్కును కోల్పోయి కుటుంబం, తల్లిదండ్రుల్ని కోల్పోయి పిల్లలు అనాథలవుతున్నారు.  పరిశ్రమలు, వర్తక, వ్యాపారం, రవాణా రంగాలు కుదేలవడంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఉపాధి వనరులు తగ్గిపోవడంతో పలువురి జీవితాలు రోడ్డున   పడుతున్నాయి.

కోవిడ్‌ టీకాతో కరోనా మహమ్మారిని అరికట్టొచ్చు. పలు   దేశాలు కోవిడ్‌ టీకాలు ప్రయోగించి కరోనా విపత్తును  అరికట్టాయి.  దేశ ప్రజల ప్రాణ రక్షణకు కోవిడ్‌ టీకాల కార్యక్రమం దేశ వ్యాప్తంగా పూర్తి చేయాలన్నారు. ప్రజల బాగు కోసం అన్ని రాష్ట్రాలు  ఏకమై ఐక్య పోరాటానికి ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలందరికీ సత్వరమే కోవిడ్‌ టీకాలు అందడమే ఉద్యమ ధ్యేయమన్నారు.  కోవిడ్‌ టీకాల జాతీయ ఉత్పాదన అరకొరగా ఉంది. ప్రపంచ ఉత్పాదక సంస్థల నుంచి టీకాలు కొనుగోలు   ఉద్యమానికి ఊపిరిపోస్తుంది. అంతర్జాతీయ కోవిడ్‌ టీకాల ఉత్పాదన సంస్థలు రాష్ట్రాలవారీ వ్యాపార ఒప్పందంపట్ల మొగ్గు కనబరచడం లేదని ఆయన ఆ లేఖలో గుర్తు చేశారు. 

కేంద్ర  ప్రభుత్వం ముందడుగు వేసి అంతర్జాతీయ ఉత్పాదన సంస్థల నుంచి  కోవిడ్‌ టీకాలు కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేసే  విధానం ఉత్తమమమని ఆయన అభిప్రాయపడ్డారు.  స్థానిక అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా  టీకాల ప్రదాన కార్యక్రమంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ఇంతకు ముందే లేఖ రాసి అభ్యర్థించినట్లు  ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో నవీన్‌ పట్నాయక్‌ వివరించారు. ఈ ప్రతిపాదనల పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు త్వరగా స్పందించి తీర్మానాలు చేసి కరోనా తరిమివేతలో విజయం సాధించేందుకు ముందుకు రావాలని  ఆ లేఖలో అభ్యర్థించారు.

click me!