
న్యూఢిల్లీలో దారుణం జరిగింది. తండ్రి పుట్టినరోజు సందర్బంగా కేక్ కొనడానికి వెళ్లిన ఓ యువకుడిని నలుగురు వ్యక్తులు పొడిచి చంపారు. మంగళవారం జరిగిన ఈ ఘటన సీసీ టీవీ కెమెరాల్లో నమోదయ్యింది.
ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ హత్యకు కారణం ప్రేమ వ్యవహారమే అని తేలింది. నిందితుడు, హతుడు ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించడంతో ఈ దారుణం జరిగిందని తేలింది.
హతుడు కునాల్ (19) గా గుర్తించారు. తండ్రి బర్త్ డేకు కేక్ కొందామని పేస్ట్రీ షాపుకు వెడుతుండగా నలుగురు యువకులు అటకాయించారు. ఆ వెంటనే కత్తులతో దాడి చేసి.. పొడిచి చంపేశారు. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాల్లో నమోదయ్యింది.
సిసిటివి ఫుటేజీలో రికార్డైన దాని ప్రకారం వారినుంచి కునాల్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ.. వారు అతన్ని అనేకసార్లు పొడిచి చంపినట్లు తెలుస్తుంది. ఈ సంఘటన దక్షిణ ఢిల్లీలోని అంబేద్కర్ నగర్‌లో జరిగింది.
ఇండియాలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు...
బాధితుడు ఛాతీ, వీపు, పొత్తికడుపులో పలుసార్లు పొడిచి చంపారని పోలీసులు తెలిపారు. వెంటనే గమనించిన స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఈ నేరానికి ఉపయోగించిన రెండు కత్తులు ఇటీవలే ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
"నిందితుడు గౌరవ్ మరియు బాధితుడు కునాల్ ఇద్దరూ ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారని, దీని కారణంగా ఇద్దరి మధ్య శత్రుత్వం ఉందని వెల్లడైంది. దర్యాప్తులో రెండు కత్తులను ఆన్‌లైన్‌లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా నిందితులు ఆర్డర్ చేసినట్లు తెలిసింది." అని ఒక పోలీసు అధికారి తెలిపారు. ఈ దారుణానికి పాల్పడ్డ నలుగురు నిందితులపై హత్య కేసు నమోదైంది.