
భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్లకు గతంలో అందించిన ఛార్జీల రాయితీలను పునరుద్ధరించాలని కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కేంద్రం వద్ద రూ.45 లక్షల కోట్ల బడ్జెట్ ఉందని, సీనియర్ సిటిజన్లకు రాయితీని వర్తింపజేస్తే రూ.1600 కోట్లు ఖర్చవుతుందని ఆప్ చీఫ్ పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని సముద్రంలో చుక్కగా అభివర్ణించిన ఆయన, ఈ సదుపాయాన్ని నిలిపివేయడం ద్వారా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదనే సందేశాన్ని సీనియర్ సిటిజన్లకు ఇస్తోందని ఆరోపించారు.
ప్రధాని మోడీ మౌనమెందుకు..? : బెంగాల్, బీహార్ అల్లర్లపై కపిల్ సిబల్
ఇది దేశ సంస్కృతికి విరుద్ధమని, వృద్ధుల ఆశీర్వాదం లేకుండా ఏ వ్యక్తి, సమాజం, దేశం పురోగతి సాధించలేరన్నారు. వృద్ధుల ఆశీస్సులతోనే ఢిల్లీలో అన్ని రంగాల్లో పురోగతి కనిపిస్తోందని, వారి కోసం తమ ప్రభుత్వం మతపరమైన ప్రదేశాలకు ఉచిత తీర్థయాత్రలు ఏర్పాటు చేసిందని చెప్పారు.
కాగా.. కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించడానికి, ప్రజల కదలికలను నిరుత్సాహపరచడానికి సీనియర్ సిటిజన్లకు ఇచ్చిన రాయితీలను కేంద్రం 2020 లో నిలిపివేసింది. అయితే సీనియర్ సిటిజన్లకు రైల్వే అందిస్తున్న ఛార్జీల రాయితీని పునరుద్ధరించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవల సిఫార్సు చేసింది. భారతీయ రైల్వే గతంలో 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న పురుషులకు ఛార్జీలలో 40 శాతం, 58 సంవత్సరాలు ఉన్న మహిళలకు 50 శాతం తగ్గింపును అందించేది. మెయిల్, ఎక్స్ ప్రెస్, రాజధాని, శతాబ్ది, దురంతో గ్రూప్ రైళ్లలోని అన్ని క్లాసుల ఛార్జీలలో ఈ రాయితీలు ఉండేవి. కానీ వీటిని కేంద్రం 2020 మార్చి 20వ తేదీన వెనక్కి తీసుకుంది.
బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ నేతృత్వంలోని రైల్వే స్టాండింగ్ కమిటీ ఇటీవల తన నివేదికలో.. కోవిడ్ పరిస్థితి ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చిందని, జాతీయ రవాణా సాధారణ వృద్ధిని సాధించిందని తెలిపింది. ప్రయాణికుల రిజర్వేషన్ వ్యవస్థపై కమిటీ తన 12వ యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (17వ లోక్ సభ)లో కూడా కోవిడ్ కు సీనియర్ సిటిజన్లకు ముందు కల్పించిన రాయితీలను సమీక్షించాలని, కనీసం స్లీపర్ క్లాస్, 3ఏ క్లాస్ లో పరిగణించాలని పేర్కొంది. దీని వల్ల నిస్సహాయులు, నిజమైన నిరుపేద పౌరులు ఈ తరగతుల్లో ఈ సదుపాయాన్ని పొందవచ్చని కోరింది. రాయితీలను పునరుద్ధరించడానికి సానుభూతితో ఆలోచించాలని రైల్వేను కోరింది. అయితే ఈ రాయితీని తిరిగి ప్రారంభించే ఆలోచన లేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది.