
భోపాల్: నేషనల్ హెరాల్డ్ పేరు ఇప్పుడు మీడియాలో నానుతున్నది. ఈ కేసులో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షులు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ నేషనల్ హెరాల్డ్‌కు మధ్యప్రదేశ్‌లో కొత్త సమస్య ఎదురైంది. మధ్యప్రదేశ్‌లో నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్‌కు చెందిన ఆస్తులు దుర్వినియోగం అవుతున్నాయా? వాటిని కమర్షియల్ అవసరాల కోసం వాడుతున్నారా? ఆ భూమి వినియోగంలో ఏవైనా మార్పులు జరిగాయా? వంటి అంశాలపై విచారిస్తామని రాష్ట్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి భూపేంద్ర సింగ్ తెలిపారు.
మధ్యప్రదేశ్‌లోని నేషనల్ హెరాల్డ్ ఆస్తులను దర్యాప్తు చేస్తామని మంత్రి భూపేంద్ర సింగ్ అన్నారు. వీటిని కమర్షియల్ అవసరాల కోసం వినియోగిస్తున్నట్టు తేలితే.. వాటిని సీజ్ చేస్తామని తెలిపారు. తొలుత ఆ భూములను స్వాతంత్ర్య సమర యోధుల పేరిట కేటాయించారని, ఆ తర్వాత వాటిని కాంగ్రెస్ నేతల పేరిటకు మార్చారని చెప్పారు. ఢిల్లీలో నేషనల్ హెరాల్డ్‌కు చెందిన సుమారు రూ. 5000 కోట్ల ఆస్తులను సోనియా గాంధీ పేరిట మార్చినట్టుగానే ఇక్కడ కూడా మార్పులు జరిగాయని ఆరోపించారు.
నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్‌ను పబ్లిష్ చేసే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు భోపాల్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రెస్ కాంప్లెక్స్‌లోని 1.14 ఎకరాలను రూ. 1 లక్షకు 1982లో లీజుకు ఇచ్చింది. ఈ లీజు 2011తో ముగిసింది. ఈ భూమి దగ్గరకు భోపాల్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు వెళ్లి చూడగా అక్కడ అక్రమాలు కనిపించినట్టు తెలిసింది. న్యూస్ పేపర్ కోసం ఆ భూములు వినియోగించకుండా కమర్సియల్ అవసరాల కోసం వాడుతున్నట్టు అధికారులు కనుగొన్నారు.
లీజుకు ఇచ్చిన భూమిలో భాగాలు చేసి పలుమార్లు పలువురికి అమ్మేసిందని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌పై ఆరోపణలు చేస్తున్నారు. ఈ కారణంగా లీజును రిన్యూ చేయడానికి వారు నిరాకరిస్తున్నారు. 2012లో లీజును రద్దు చేస్తూ బీడీఏ అధికారులు నోటీసులు పంపారు.