దేశంలో ప్రజాస్వామ్యం లేదు.. నియంతృత్వ పాలన: కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు

By Mahesh KFirst Published Aug 5, 2022, 11:19 AM IST
Highlights

రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, ప్రస్తుతం నియంతృత్వం అమలవుతున్నదని ఆయన ఈ రోజు విలేకరుల సమావేశంలో అన్నారు. ఏళ్ల తరబడి ఇటుకు పై ఇటుక పేరుస్తూ కట్టుకున్న దేశాన్ని కళ్ల ముందు నాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
 

న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు ఏజెన్సీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నేషనల్ హెరాల్డ్ సంస్థపై దర్యాప్తు చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని అన్నారు. ప్రస్తుతం దేశంలో నియంతృత్వమే అమలు అవుతున్నదని మండిపడ్డారు.

శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ‘మనమంతా ఇప్పుడు ప్రజాస్వామ్యం మరణాన్ని చూస్తున్నాం. సుమారు శతాబ్ద కాలం నుంచి మన దేశం ఇటుక మీద ఇటుక పెట్టినట్టుగా నిర్మించుకున్న దేశం మన కళ్ల ముందే ధ్వంసం అయిపోతున్నది. దేశంలో నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఎవరు నిలబడినా వారిపై తీవ్ర దాడి జరుగుతున్నది. వారు విషపూరిత దాడులు, భౌతిక దాడులు, అరెస్టులు, జైలుకు వెళ్లడాలను ఎదుర్కోవాల్సి వస్తున్నది’ అని అన్నారు. 

కాంగ్రెస్‌కు చెందిన నేషనల్ హెరాల్డ్ న్యూస్‌పేపర్‌పై ఈడీ దర్యాప్తు చేయడాన్ని కాంగ్రెస్ ఖండించింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నవారి గొంతును కేంద్ర దర్యాప్తు ఏజెన్సీల ద్వారా బీజేపీ నులిమే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించింది.

‘నేను ప్రజల సమస్యలను ఎంతగా లేవనెత్తుతానో.. ప్రభుత్వంపై ఎంతగా దాడి చేస్తానో.. అంతకు మించి నేను వారికి లక్ష్యంగా మారుతున్నాను. ఇలా జరుగుతున్నందుకు తనకు బాధగా ఏమీ లేదని, నా పై దాడి చేయండి’ అని పేర్కొన్నారు. 

పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చర్చను, సంవాదాన్ని అస్సలు సహించడం లేదని, అందుకు ససేమిరా అంటున్నదని రాహుల్ గాంధీ అన్నారు. ప్రజా సమస్యలైనా ధరల పతనం, నిరుద్యోగం, సమాజంలో హింస వంటి అంశాలపై చర్చ జరగవద్దనేదే కేంద్ర ప్రభుత్వ ఆలోచన అని ఆరోపించారు. ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఎజెండా కేవలం కొంత మంది ప్రజల ప్రయోజనాలు మాత్రమేనని ఆరోపణలు సంధించారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం రోజులో 24 గంటలు అబద్ధాలు మాట్లాడుతూనే ఉంటుందని మండిపడ్డారు. ధరల పెరుగుదలను, నిరుద్యోగాన్ని, భారత భూభాగంలోకి చైనా చొరబాటునూ వారు చాలా సులువుగా తిరస్కరిస్తుంటారని కేంద్రంపై విమర్శలు చేశారు.

నేషనల్ హెరాల్‌ కార్యాలయ ప్రాంగణంలోని యంగ ఇండియన్ కంపెనీని ఈడీ తాత్కాలికంగా సీజ్ చేసింది. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ పని చేసింది. ఈడీ ఈ ఆఫీస్‌ను సీజ్ చేసిన వెంటనే ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్‌కు వెళ్లే దారిని బ్లాక్ చేశారు.  ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ రోజు మాట్లాడటం గమనార్హం.

click me!