జమ్ము కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ ఇండియా కూటమి నుంచి వైదొలుగుతుందని, లోక్ సభ స్థానాలకు ఒంటరిగా పోటీ చేస్తుందని ఫరూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలను తప్పుగా చర్చకు తీసుకున్నారని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. తాము ఇండియా కూటమిలో భాగంగానే ఎన్నికలకు వెళ్లతామని వివరించారు.
Jammu Kashmir: జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ము కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని, ఇండియా కూటమి నుంచి బయటికి వచ్చేస్తామని చెప్పారు. అంతేకాదు, భవిష్యత్‌లో ఎన్డీయే కూటమితో చేతులు కట్టే అవకాశాలను కొట్టిపారేయలేమనీ ఆయన సంకేతాలు ఇచ్చారు. దీంతో ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలిందని, జమ్ము కశ్మీర్‌లో కాంగ్రెస్‌తో పొత్తు లేదన్నట్టే అనే చర్చ జరిగింది. కానీ, ఇంతలోనే ఫరూఖ్ అబ్దుల్లా కొడుకు ఒమర్ అబ్దుల్లా తండ్రి వ్యాఖ్యలకు భిన్నంగా కామెంట్ చేశారు.
జమ్ము కశ్మీర్‌లో లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని, అన్ని స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పోటీ చేస్తుందని ఫరూఖ్ అబ్దుల్లా ప్రకటించారు. కాంగ్రెస్‌తో సీట్ల పంపకాలపై చర్చలు సఫలం కాలేవని తెలిపారు. కాగా, ఒమర్ అబ్దుల్లా ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. తండ్రి ఫరూఖ్ అబ్దుల్లాను పక్కనే కూర్చోబెట్టుకుని మీడియాతో మాట్లాడారు. తాము ఇండియా కూటమిలోనే ఉన్నామని స్పష్టం చేశారు.
‘మేం ఇండియా కూటమిలో భాగమే. ఇప్పటికీ మాది ఇండియా కూటమే. కానీ, కొన్ని విషయాలను సందర్భానికి దూరంగా తీసుకోబడ్డాయి’ అని అన్నారు. ‘పార్టీ క్యడర్ ఎప్పుడూ పొత్తులో పోటీ చేయడాన్ని ఇష్టపడదు. ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలు క్యాడర్ అభిప్రాయాలను ప్రస్ఫుటించాయి. పొత్తులో పోటీ చేసిన ప్రతిసారీ నష్టపోయేది నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీనే. అందుకే క్యాడర్ ఈ విషయాన్ని మాకు గుర్తు చేస్తూ ఉంటుంది’ అని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ‘కానీ, కొన్ని సార్లు పెద్ద లక్ష్యం కోసం చిన్న చిన్న త్యాగాలు చేయకతప్పదు. జమ్ము, ఉదంపూర్, లడాఖ్‌లో బీజేపీని ఆపడమే మన లక్ష్యం అయినప్పుడు మేం ఈ త్యాగానికి సిద్ధమే. కాంగ్రెస్‌తో మా చర్చలను పూర్తి చేసుకుంటాం. ఇండియా కూటమి ప్రధాన లక్ష్యం బీజేపీని ఓడించడమే. రెండు పడవల మీద ప్రయాణం అసంగతం. మేం ఇండియా కూటమిలో భాగంగానే ఎన్నికలకు వెళ్లుతాం’ అని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు.