
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి మదర్సాలో జరిగే మార్నింగ్ ప్రేయర్‌లో తప్పనిసరిగా జాతీయ గీతాన్ని ఆలాపించాలని ఆదేశించింది. గురువారం ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి స్వాతంత్ర దినోత్సవాన ప్రతి మదర్సా తప్పకుండా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించాలని 2017లో తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. దాదాపు ఐదేళ్ల తర్వాత తాజా ఆదేశాలు రావడం గమనార్హం. దీనితోపాటు విద్యార్థుల నమోదు, అటెండెన్స్, మదర్సాల్లో ఉపాధ్యాయుల నియామక ప్రక్రియపైనా నిర్ణయాలు యూపీ బోర్డ్ ఆఫ్ మద్రాసా ఎడ్యుకేషన్ తీసుకుంది.
బోర్డు చైర్‌పర్సన్ ఇఫ్తికార్ అహ్మద్ జావేద్ సారథ్యంలో జరిగిన సమావేశంలో గురువారం ఈ నిర్ణయాలు తీసుకన్నారు. మదర్సాల్లో టీచర్ల నియామకానికి టెట్ ఆధారిత మదర్సా టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించనున్నట్టు బోర్డు తెలిపింది. మదర్సాల్లో బోధించాలంటే ఇందులో తప్పనిసరిగా అర్హులై ఉండాలని పేర్కొంది. అయితే, ఈ ఎన్నిక ప్రక్రియను అంతిమంగా మేనేజ్‌మెంట్ ఖరారు చేస్తుందని, దీనిపై త్వరలోనే ఓ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపనున్నట్టు వివరించింది.
అనేక పాఠశాలల్లో జాతీయ గీతాన్ని ఆలపిస్తుంటారని ఇఫ్తికార్ అహ్మద్ జావేద్ అన్నారు. తము కూడా మదర్సా విద్యార్థుల్లో దేశ భక్తిని పెంపొందించాలని భావిస్తున్నట్టు చెప్పారు. అంతేకాదు, దేశ చరిత్రను, సంస్కృతినిక మదర్సాల్లో చదివి విద్యార్థులు తెలుసుకోవడానికి ప్రోత్సహిస్తామని వివరించారు. ఇప్పటికే కొన్ని మదర్సాల్లో మతపరమైన చదువులతోపాటు ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రతి మదర్సాలో జాతీయ గీత ఆలాపన తప్పనిసరిగా అమలు చేస్తామని పేర్కొన్నారు.
దీనితోపాటు మదర్సాల్లో బోధించే ఉపాధ్యాయుల పిల్లలు ఎంత మంది ప్రైవేటు లేదా కాన్వెంట్ స్కూళ్లలో చదువుతున్నారో సర్వే చేస్తున్నామని వివరించారు. మదర్సాల్లో బోధించే ఉపాధ్యాయులు ఇతరులు అందులో చదువుకోవాలని చెబుతూనే తమ పిల్లలను వేరే పాఠశాలలకు పంపిస్తున్నారని తెలిపారు.
విద్యార్థుల నమోదు కోసం ఆధార్ కార్డును లింక్ చేస్తామని, తద్వారా వెరిఫికేషన్, అటెండెన్స్ ప్రక్రియను సులభతరం చేయనున్నట్టు ఆయన వివరించారు. అలాగే, ఉపాధ్యాయులకూ బయోమెట్రిక్ తప్పనిసరి చేయనున్నట్టు వివరించారు.
మదర్సా బోర్డు పరీక్షలు మే 14 నుంచి 27వ తేదీల మధ్య జరుగుతాయని వివరించారు. గతేడాది అక్టోబర్‌లో జరిగిన తమ సమావేశంలో మదర్సాల్లో హిందీ, ఇంగ్లీష్, గణితం, సోషల్ సైన్సెస్, సైన్స్‌లను తప్పనిసరి సబ్జెక్టులుగా చేస్తామని అన్నారు. సీనియర్ సెకండరీ లెవెల్ వరకు ఈ విధానాన్ని తప్పకుండా అమలు చేస్తామని వివరించారు. వీటితోపాటు ఆరు పరీక్ష పేపర్లను తప్పనిసరి చేయనున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయాల ద్వారా తమ విద్యార్థులూ ప్రధాన స్రవంతి పిల్లలతో కలిసిపోయేలా ఉండాలని భావిస్తున్నట్టు వివరించారు.