సీబీఐ అధికారిని అంటూ నమ్మించి ఓ రైల్వే ఉద్యోగి వద్ద రూ. 20 లక్షలు కాజేయాలని నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి ప్లాన్ వేశాడు. కానీ, ఆ రైల్వే ఉద్యోగి నిజంగానే సీబీఐకి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.
ముంబయి: మహారాష్ట్రలో ఓ వ్యక్తి సీబీఐ అధికారిగా అవతారమెత్తాడు. సీబీఐ అధికారిగా ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ముందు బుకాయించాడు. ఆయనపై పలు కేసులు ఉన్నాయని, వాటిని తాను డీల్ చేయాలంటే రూ. 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కానీ, ఆ వ్యక్తిపై డౌట్ వచ్చిన ప్రభుత్వ ఉద్యోగి సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చాడు. రూ. 1 లక్ష ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నాగ్‌పూర్ పోలీసులు నిందితుడిని శుక్రవారం అరెస్టు చేశారు.
భారత రైల్వే శాఖలో సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజినీర్ సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ నకిలీ సీబీఐ అధికారి వ్యవహారం బయటపడింది. సీబీఐ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) ర్యాంకు అధికారికి తాను పర్సనల్ అసిస్టెంట్ అంటూ సదరు వ్యక్తి పరిచయం చేసుకున్నాడని ఫిర్యాదులో రైల్వే ఉద్యోగి తెలిపారు. తనపై కొన్ని ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని తాను దర్యాప్తు చేయాలంటే రూ. 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని పేర్కొన్నారు.
Also Read: మధ్యప్రదేశ్‌లో రామ మందిరంపై రాజకీయం.. రాజీవ్ గాంధీకి క్రెడిట్ దక్కాలన్న కాంగ్రెస్, బీజేపీ రియాక్షన్
ఫిర్యాదు అందగానే సీబీఐ అధికారులు ఓ ట్రాప్ వేశారు. ఒక లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఆ తర్వాత నిందితుడిని సాదిక్ ఖురేషీగా గుర్తించారు. ఆయన నివాసంలో తనిఖీలు చేయగా మరికొన్ని నేరపూరిత డాక్యుమెంట్లు కనిపించాయి. వాటిని అధికారులు రికవరీ చేసుకున్నారు. సీబీఐ కోర్టు ముందు నిందితుడిని హాజరుపరచగా నవంబర్ 6వ తేదీ వరకు కస్టడీకి అనుమతి లభించింది.