మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. ప్రమోటర్ల నుంచి భూపేష్ బఘేల్‌కు రూ.508 కోట్ల చెల్లింపులు : ఈడీ సంచలన ప్రకటన

By Siva Kodati  |  First Published Nov 3, 2023, 8:14 PM IST

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భఘేల్‌ మెడకు చుట్టుకుంది . బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు ఆయనకు ఇప్పటి వరకు రూ.508 కోట్లు చెల్లించారని .. అది విచారణకు సంబంధించిన అంశమని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం పేర్కొంది.


ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల వేల కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ భఘేల్‌ మెడకు చుట్టుకుంది. బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు ఆయనకు ఇప్పటి వరకు రూ.508 కోట్లు చెల్లించారని .. అది విచారణకు సంబంధించిన అంశమని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం పేర్కొంది. ఈ మేరకు క్యాష్ కొరియర్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు ఈడీ వెల్లడించింది. 

క్యాష్ కొరియర్‌గా పనిచేస్తున్న అసిమ్ దాస్‌ నుంచి రూ.5.39 కోట్లను ఈడీ స్వాధీనం చేసుకుని, అతనిని అరెస్ట్ చేసింది. ప్రస్తుతం మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ దాని ప్రమోటర్లపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అసిమ్ దాస్‌ను ప్రశ్నించడం, అతని నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్షకు పంపినట్లు ఈడీ తెలిపింది.

Latest Videos

ఈ క్రమంలో శుభమ్ సోనీ (మహాదేవ్ నెట్‌వర్క్ స్కాం నిందితుల్లో ఒకడు) దాస్‌కు పంపిన ఈమెయిల్‌ను పరిశీలించగా.. అనేక ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయని ఈడీ అధికారులు పేర్కొన్నారు. రెగ్యులర్‌గా, గతంలో జరిగిన చెల్లింపులకు సంబంధించిన కీలక సమాచారం సదరు మెయిల్‌లో వున్నట్లు తెలిపింది. అలాగే మహాదేవ్ యాప్ ప్రమోటర్లు.. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్‌కు దాదాపు రూ.508 కోట్లు చెల్లించినట్లుగా ఈడీ సంచలన ప్రకటన చేసింది. 

ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7, నవంబర్ 17న రెండు దశల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. భూపేష్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని సర్వేలు చెబుతున్న దశలో ఈడీ ప్రకటన రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అంశాన్ని బీజేపీ ఖచ్చితంగా రాజకీయంగా వినియోగించుకుంటుందని విశ్లేషకులు అంటున్నారు. 

click me!