మధ్యప్రదేశ్‌లో రామ మందిరంపై రాజకీయం మొదలైంది. రామ మందిర నిర్మాణ క్రెడిట్ మొత్తం బీజేపీనే తీసుకుంటున్నదని, అసలు 1986లో బాబ్రీ మసీదు ప్రాంగణంలోని తాత్కాలిక రాముడి గుడి తాళాలు తెరిపించింది అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ అని కమల్ నాథ్ అన్నారు.
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతున్నది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఢీ అంటే ఢీ అన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ ప్రచారంలో ఇప్పుడు రామ మందిరం ప్రస్తావన వచ్చింది. రామ మందిరాన్ని బీజేపీ తన సొంత ఆస్తిలా భావిస్తున్నదని, రామ మందిర నిర్మాణం పూర్తిగా బీజేపీ వల్లే సాధ్యమైందన్నట్టుగా వ్యవహరిస్తున్నదని మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ అన్నారు. అంతేకాదు, రామ మందిరం సాకారం కావడంలో రాజీవ్ గాంధీకి క్రెడిట్ దక్కుతుందని వివరించారు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ 1986లో వివాదాస్పద బాబ్రీ మసీదు ప్రాంగణలో తాత్కాలిక రామ మందిరం తాళాలను అప్పటి పీఎంగా ఉన్న రాజీవ్ గాంధీ తెరిపించారని కమల్ నాథ్ అన్నారు. తద్వార బాబ్రీ మసీదు ప్రాంగణంలోకి హిందువులు వెళ్లి ప్రార్థన చేసుకోవడానికి వీలు చిక్కిందని తెలిపారు. కానీ, బీజేపీ మాత్రం అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి పూర్తి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నదని వివరించారు.
‘రామ మందిరానికి బీజేపీ క్రెడిట్ తీసుకోరాదు. రామ మందిరం ఏ ఒక్క పార్టీకి చెందదు. బీజేపీ మాత్రం రామ మందిరం వారి ఆస్తిలా భావిస్తారు. రామ మందిరం దేశం మొత్తానికి చెందుతుంది’ అని కమల్ నాథ్ అన్నారు.
Also Read: కాంగ్రెస్ పై కేసీఆర్ అంచనాలు తలకిందులు? హస్తానికి పార్టీల మద్దతు పెరగడంతో బీఆర్ఎస్‌లో ఆందోళన!
ఈ వ్యాఖ్యలపై బీజేపీ రియాక్ట్ అయింది. రామ మందిరానికి బీజేపీ ఎప్పుడూ క్రెడిట్ తీసుకోలేదని అమిత్ షా అన్నారు. అదే సందర్భంలో రాజీవ్ గాంధీ కాంట్రిబ్యూషన్‌ను ఆయన ప్రశ్నించారు. ‘మేం ప్రజలను వెంట తీసుకుని వెళ్లుతాం. అంతేకానీ, క్రెడిట్ తీసుకోలేదు. మరి కమల్ నాథ్ ఎలా రాజీవ్ గాంధీకి క్రెడిట్ ఇస్తున్నారు?’ అని అమిత్ షా ఛత్తీస్‌గడ్‌లో బీజేపీ మ్యానిఫెస్టో విడుదల చేస్తూ అన్నారు.
కాగా, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కమల్ నాథ్ కామెంట్లపై షార్ప్‌గా రియాక్ట్ అయ్యారు. ‘ఆర్ఎస్ఎస్‌కు తల్లే కాంగ్రెస్. 1986లో రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధే ప్రధాని. బాబ్రీ మసీదు గురించి కమల్ నాథ్ చేసిన వ్యాఖ్యలు దేశమంతా వినాలని ఆశిస్తున్నాను’ అని ఒవైసీ అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ అసలు ముఖం అని కామెంట్ చేశారు.