పొదుపు చర్యలు.. మమత భోజనంలో మటన్, రొయ్యలకూర మాయం

First Published Jul 6, 2018, 1:19 PM IST
Highlights

ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఉపయోగించకుండా పొదుపు చర్యలను పాటించాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయించారు. దీనిలో భాగంగా తన భోజనంలోంచి మటన్, రొయ్యలకూరను ఆమె తొలగించారు.

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎంత నిరాడంబరంగా ఉంటారో  ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. తోటి ముఖ్యమంత్రులంతా విలాసవంతమైన భవనాల్లో, భారీ కాన్వాయ్‌లలో తిరుగుతుంటే.. మమత మాత్రం అద్దె అపార్ట్‌మెంట్లో ఉంటూ, చేనేత చీరలు, రబ్బరు చెప్పులు ధరించి సాదాసీదాగా వుంటారు. చూస్తున్న వారేవరూ కూడా ఆమె సీఎం అంటే ఎవరూ నమ్మరు కూడా. తాజాగా ప్రజల కోసం భోజనం విషయంలోనూ మరో త్యాగానికి సిద్ధమయ్యారు.

ప్రజాధనాన్ని విలాసవంతమైన కార్యక్రమాలు, ఈవెంట్లకు వినియోగించకుండా పొదుపు చర్యలు పాటించాలని ఆమె మంత్రులు, అధికారులను ఆదేశించారు. అందరికీ చెప్పడమే కాకుండా.. దీనిని తాను కూడా ఆచరించాలని నిర్ణయించిన మమత.. తను ఎంతో ఇష్టంగా తినే.. మటన్, రొయ్యల కూరలను తన భోజనంలోంచి తొలగించుకున్నారు.

రాష్ట్రంలో పాలనాపరమైన ఖర్చును తగ్గించుకోవడానికి వీలుగా పొదుపు కోసం 15 అంశాలతో కూడిన కార్యక్రమాన్ని రూపొందించారు మమత.. దీనిలో భాగంగా అధికారిక సమావేశాలు, ఈవెంట్లలో అలంకరణలు, రిఫ్రెష్‌మెంట్ ఖర్చులు తగ్గించడం, మంత్రులు, అధికారులు విదేశాలతో పాటు ఢిల్లీ పర్యటనలు తగ్గించడం, కొత్తగా ఏసీలు కొనుగోలు చేయరాదని సూచించారు. తప్పనిసరైతేనే విమానాల్లో వెళ్లాలని అది కూడా ఎకానమీక్లాస్‌లోనే వెళ్లాలని మమత కోరారు. తాజా చర్యతో మమతా బెనర్జీ మరోసారి దేశప్రజల దృష్టిని ఆకర్షించారు. 

click me!