
Indian Culture - Muslims: భారతదేశంలోని ముఖ్యమైన సాంస్కృతిక, సామాజిక ప్రదేశాలలో భారతీయ ముస్లింలు కనిపించడం లేదని తరచుగా వాదనలు వినిపిస్తుంటాయి. అయితే, దేశంలోని పలు అంశాలు అలాంటి పరిస్థితులు లేవని చాటిచెబుతున్నాయి. అలాంటి వాటిలో సినీ, మీడియా పరిశ్రమలు ఉన్నాయి. ఆయా రంగాల్లో అనేక మంది ముస్లింలో తమ సత్తా చాటుతూ భారతీయ వైవిధ్యతను ప్రదర్శిస్తున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా, భారతదేశ మీడియా, సినీ పరిశ్రమలో ముస్లిం వాటా గణనీయంగా పెరిగింది. నటులు, దర్శకుల నుండి రచయితలు, నిర్మాతల వరకు.. వివిధ విభాగాలలో భారతీయ ముస్లింలు తమ ఉనికిని చాటుకుంటున్నారు. దేశం గొప్ప-వైవిధ్యమైన సాంస్కృతిక ప్రతిబింబంలా నిలుస్తున్నారు. భారతదేశపు అభివృద్ధి చెందుతున్న చలనచిత్ర పరిశ్రమ బాలీవుడ్ లో ముస్లిం నటులు పెరగడం ఈ ధోరణికి ముఖ్యమైన ఉదాహరణలలో ఒకటి. షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి అనేక మంది నటులు ఇంటి పేరుగా మారారు. భారతీయ సినిమాలో అత్యంత విజయవంతమైన నటులగా పెరుగాంచారు. ఈ స్టార్స్ తో పాటు నవాజుద్దీన్ సిద్ధిఖీ, గౌహర్ ఖాన్, హ్యూమా ఖురేషి వంటి ఎందరో అప్ కమింగ్ ముస్లిం నటులు ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేస్తున్నారు. అయితే, సీని పరిశ్రమలో నటులు మాత్రమే కాదు.. ముస్లిం రచయితలు, దర్శకులు, నిర్మాతలు కూడా పరిశ్రమ ఎదుగుదలకు దోహదపడుతున్నారు. ఉదాహరణకు ముస్లిం అయిన అలీ అబ్బాస్ జాఫర్ 'సుల్తాన్', 'టైగర్ జిందా హై' వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.
సంగీతం, టెలివిజన్ వంటి భారతదేశ వినోద పరిశ్రమలోని ఇతర రంగాలలో కూడా ముస్లింలు తమదైన ముద్ర వేస్తున్నారు. ముస్లిం గాయకులు, సంగీతకారులు దశాబ్దాలుగా భారతదేశ సంగీత దృశ్యంలో అంతర్భాగంగా ఉన్నారు. వారిలో చాలా మంది హిట్ పాటలు, ఆల్బమ్ లను అందిస్తున్నారు. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ ముస్లిం సంగీతకారులలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఒకరు. ఆయన 2001 లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను పొందిన లెజెండరీ షెహనాయ్ వాద్యకారుడు. ఇతర ప్రముఖ ముస్లిం సంగీతకారులలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీతకారులతో కలిసి పనిచేసిన తబలా వాద్యకారుడు జాకీర్ హుస్సేన్, భారతీయ శాస్త్రీయ సంగీతానికి చేసిన కృషికి అనేక అవార్డులతో గుర్తింపు పొందిన సరోద్ వాద్యకారుడు అంజాద్ అలీ ఖాన్, హిందీ, ఆంగ్లంలో తన కృషికి అనేక అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న ఎ.ఆర్.రెహమాన్ లు ఉన్నారు. ముస్లిం గేయ రచయితలు కూడా భారతదేశ సంగీత రంగానికి గణనీయమైన కృషి చేశారు. జావేద్ అక్తర్, బాలీవుడ్ లో అత్యంత ప్రశంసలు పొందిన గీత రచయితలలో ఒకరు.. అనేక అవార్డులను గెలుచుకున్నారు. మరో ముస్లిం గీత రచయిత ఇర్షాద్ కమిల్ సైతం చాలా హిట్ చిత్రాలకు పాటలు రాశారు.
వినోద పరిశ్రమ నిపుణులతో పాటు, ముస్లిం పాత్రికేయులు కూడా భారతదేశ మీడియా ల్యాండ్ స్కేప్ కు గణనీయమైన సహకారం అందిస్తున్నారు. సీఎన్ఎన్ ఐబీఎన్ న్యూస్ ఛానల్ లో జర్నలిస్ట్, యాంకర్ గా పనిచేస్తున్న మరియా షకీల్, ఏబీపీ న్యూస్ కు చెందిన మరో స్టార్ యాంకర్ రుబికా లియాఖత్ వంటి జర్నలిస్టులు చాలా ఏళ్లుగా జాతీయ టీవీలో ప్రైమ్ టైమ్ డిబేట్లకు నేతృత్వం వహిస్తున్నారు. సీమా చిస్తీ, ఆరిఫా ఖానుమ్, జావేద్ అన్సారీ వంటి సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. ఈ పాత్రికేయులు ముఖ్యమైన కథనాలు, నిశితమైన విశ్లేషణను అందించడమే కాకుండా యథాతథ స్థితి పై అనేక సార్లు ప్రశ్నించారు. భారత మీడియాలో మరింత జవాబుదారీతనం, పారదర్శకతను ప్రోత్సహించారు.
మీడియా, వినోద పరిశ్రమలో ముస్లిం స్వరాలు పెరగడం భారతదేశ సాంస్కృతిక భూభాగంలో పెరుగుతున్న వైవిధ్యం-సమ్మిళితతకు ప్రతిబింబంగా చెప్పవచ్చు. పరిశ్రమ ఎదుగుదలకు, అభివృద్ధికి గణనీయమైన తోడ్పాటు అందిస్తున్న భారత ముస్లిం కళాకారులు, నిపుణుల ప్రతిభకు, సృజనాత్మకతకు ఇది నిదర్శనం. ఏదేమైనా, ప్రాతినిధ్యం-వైవిధ్యం విషయానికి వస్తే పరిశ్రమ ఇప్పటికీ సవాళ్లను ఎదుర్కొంటుందని చెప్పాలి. ముస్లిం నటులు, వృత్తి నిపుణులు, పాత్రికేయులు విజయాలు సాధించినప్పటికీ, పరిశ్రమలో దళితులు సహా ఇతర అట్టడుగు వర్గాలకు ఇంకా ఎక్కువ ప్రాతినిధ్యం అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు.