
ముంబయి: అనుమానం పెనుభూతం. ఒకసారి అది జనించిందంటే.. సులువుగా వదిలిపెట్టదు. అనుమానాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకుంటేనే ముఖ్యంగా ప్రేమికులైనా.. దంపతులైనా ఏకమై సాగేది. లేదంటే.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగానే కాదు.. కొన్నిసార్లు ఆ అనుమానాలు శృతిమించి ప్రాణాలనే తోడేయొచ్చు. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో అనుమానమే ఓ యువతి ప్రాణాలు తీసేసింది.
24 ఏళ్ల అఖిలేశ్ ప్యారేలాల్ గౌతమ్, 27 ఏళ్ల మనీషా జైస్వార్‌లు ప్రేమికులు. కొంతకాలంగా వారు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. త్వరలోనే తమ బంధానికి పెళ్లి ముడి వేద్దామనుకున్నారు. కానీ, అంతలోనే వారి మధ్యలోకి ఈ పెనుభూతం ప్రవేశించింది. తన ప్రేయసి మనీషా జైస్వార్ మరో యువకుడితో రిలేషన్‌షిప్ మెయింటెయిన్ చేస్తున్నదేమో అని అఖిలేశ్ ప్యారేలాల్ గౌతమ్ అనుమానపడ్డాడు. ఈ అనుమానం పెరిగి పెద్దదైంది. ఎలాగైనా.. ఇక ఈ విషయాన్ని తేల్చుకోవాల్సిందేనని అనుకున్నాడు.
గురువారం తెల్లవారుజామున అఖిలేశ్ ప్యారేలీల్ గౌతమ్ కందీవలి సబర్బన్‌లోని మనీషా జైస్వార్ ఇంటికి వెళ్లాడు. ఇద్దరు మాట్లాడుకున్నారు. ఈ విషయం రాగానే ఉభయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ గొడవ మాటల నుంచి చేతల దాకా వెళ్లింది. ఈ క్రమంలోనే అఖిలేశ్ ప్యారేలాల్ గౌతమ్ తన ప్రియురాలి గొంతు కోశాడు.
మనీషా జైస్వార్‌ను హాస్పిటల్‌కు తరలించారు. కానీ, వైద్యులు ఆమెను హాస్పిటల్‌లో అడ్మిట్ చేసుకోవడానికి ముందే మరణించినట్టుగా తెలిపారు. మనీషా జైస్వార్ తలకు రెండు బలమైన గాయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాతే పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు.
ఈ కేసును దర్యాప్తు చేయడానికి పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. మరణించిన అమ్మాయి గురించిన వివరాలు కనుక్కున్నారు. ఆమె బాయ్‌ఫ్రెండ్ గురించి సమాచారం తెలుసుకున్న తర్వాత అతన్ని ట్రాక్ చేయడాన్ని ప్రారంభించారు. అనంతరం, మర్డర్ కేసులో అరెస్టు చేశారు. తదుపరి విచారణ ఇంకా కనొసాగుతుంది.