
బెంగళూరు: కర్ణాటకలో దక్షిణ కన్నడ జిల్లాలో మరో దారుణ ఘటన జరిగింది. 23 ఏళ్ల ముస్లిం యువకుడిని కొందరు దుండగులు దారుణం హతమార్చారు. ఈ జిల్లా ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న సంగతి తెలిసిందే. బీజేపీ యువజన విభాగం యువ మోర్చా నేత ప్రవీణ్ నెట్టారు హత్యతో ఈ జిల్లా అట్టుడికిపోతున్నది. ఇదే తరుణంలో ఓ ముస్లిం యువకుడి హత్య జరగడం మరింత కలకలం రేపింది.
మృతుడిని ఫాజిల్‌గా పోలీసులు గుర్తించారు. మంగళూరు సూరత్‌కల్ ఏరియాలో పాజిల్‌పై దుండగులు కత్తులతో పొడిచి చంపేశారు. ముగ్గురు నుంచి నలుగురు దుండగులు ముఖాలకు ముసుగులు వేసుకుని ఈ ఘాతుకానికి పాల్పడినట్టు మంగళూరు సిటీ పోలీసు కమిషనర్ ఎన్ శశి కుమార్ వెల్లడించారు. సూరత్‌కల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగిందని, అదే స్టేషన్‌లో ఓ కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ ఏరియాను చాలా సెన్సిటివ్ ఏరియాగా భావిస్తున్నామని తెలిపారు. ఇక్కడ 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
బీజేపీ యూత్ వింగ్ నేత 32 ఏళ్ల ప్రవీణ్ నెట్టారును కొందరు గుర్తు తెలియని దుండగులు మంగళవారం రాత్రి కత్తులతో నరికి చంపారు. ప్రవీణ్ నెట్టారు వారి బ్రాయిలర్ షాప్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్లుతుండగా ఆయనను చంపేశారు. ఈ ఘటనలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వారిద్దరిని గురువారం అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.
అయితే, ఫాజిల్ హత్య వెనక గల కారణాలను మాత్రం స్పష్టంగా అధికారులు చెప్పలేదు. ఈ ఘటనకు మరో దానితో సంబంధం ఉన్నదని ఇప్పుడు చెప్పలేమని కమిషనర్ ఎన్ శశి కుమార్ తెలిపారు. తాము పారదర్శకంగా దర్యాప్తు చేస్తామని, ఈ రెండు ఘటనల మధ్య ఏమైనా సంబంధం ఉన్నదా? అనే విషయాన్ని కూడా విచారిస్తామని వివరించారు.