ఇద్దరు స్కూల్ విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 900 కోట్లు.. అధికారులేమన్నారంటే..?

By telugu teamFirst Published Sep 16, 2021, 4:39 PM IST
Highlights

ఓ ఇద్దరు పాఠశాల విద్యార్థులు ప్రభుత్వ పథకం కింద యూనిఫామ్, ఇతర ఖర్చుల కోసం వచ్చే నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. ఓ సారి వెళ్లి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేశారు. ఖాతాలో డబ్బును చూసి అదిరిపడ్డారు. ఆ ఇద్దరు విద్యార్థుల ఖాతాల్లో రూ. 900 కోట్ల పైచిలుకు డబ్బు క్రెడిట్ అయినట్టు స్టేట్‌మెంట్ పేర్కొంది.
 

పాట్నా: బిహార్‌లోని ఇద్దరు స్కూల్ విద్యార్థుల ఖాతాల్లోకి ఊహించనంత డబ్బు వచ్చి పడింది. అది నిజమా? కాదా? అనే సందేహంతో బ్యాంక్ స్టేట్‌మెంట్ల కోసం ఏటీఎం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అందులో తమ ఖాతాల్లోకి నిజంగా రూ. 900 కోట్లకుపైగానే క్రెడిట్ అయినట్టు చూపించింది. వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అదృష్టం తలుపు తట్టి వచ్చిందని సంబురపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న అధికారుల వివరణ వారి ఆశలపై నీళ్లు చల్లినట్టయింది.

ఉత్తరబిహార్ గ్రామీణ్ బ్యాంక్‌లో ఆ ఇద్దరు పిల్లలకు ఖాతాలున్నాయి. స్కూల్ యూనిఫామ్స్, వారి ఇతర ఖర్చుల కోసం ప్రభుత్వ పథకం కిందే వచ్చే నిధుల కోసం వారు ఎదురుచూస్తున్నారు. పిల్లలు సహా తల్లిదండ్రులు ఓ ఇంటర్నెట్‌కు వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేశారు. వాళ్లు అదిరిపోయే డబ్బు ఖాతాలో జమ అయినట్టు తెలిసింది. ఆరో తరగతి అబ్బాయి ఆశిష్ ఖాతాలో రూ. 6.2 కోట్లు, మరో అబ్బాయి గురు చరణ్ విశ్వాస్ అకౌంట్‌లో సుమారు రూ. 900 కోట్లు క్రెడిట్ అయినట్టు చూపించాయి. గ్రామపెద్ద ఈ విషయాన్ని ధ్రువీకరించారు. బ్యాంకు అధికారులు దీనిపై విచారణ ప్రారంభించింది.

‘ఇద్దరు విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో పెద్దమొత్తంలో డబ్బు జమ అయినట్టు నాకు తెలిసింది. దానిపై విచారణ జరుపుతున్నాం. ఇదెలా జరిగిందో తెలుసుకోవడానికే ఈ రోజు తొందరగా బ్యాంక్ ఓపెన్ చేసి చూశాం. డబ్బు పంపించే విధానంలో కంప్యూటరైజ్డ్ సిసమ్‌లో లోపం ఏర్పడిందని, అందుకే అలా ఖాతాల్లో డబ్బులు కనిపించాయని బ్యాంక్ మేనేజర్ మాకు చెప్పారు. ఆ డబ్బు వారి బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో కనిపిస్తుంది కానీ, వాస్తవంగా ఆ డబ్బులు వారి ఖాతాలో ఉండవు. బ్యాంకు ఉన్నతాధికారుల నుంచి వివరణ అడిగాం’ అని కతిహర్ జిల్లా మెజిస్ట్రేట్ ఉదయన్ మిశ్రా వివరించారు.

click me!