'ఇలాంటి హై వోల్టేజ్ డ్రామా ఎవరూ చేయలేదు' : జీ-20 అధ్యక్ష పదవిపై కాంగ్రెస్ విమర్శలు

By Rajesh KarampooriFirst Published Dec 2, 2022, 5:30 PM IST
Highlights

భార‌త్‌కు జీ20 అధ్య‌క్ష పదవిపై బీజేపీ హంగామా చేస్తుందనీ, దానిని హై వోల్టేజ్ డ్రామా అని కాంగ్రెస్ నేత జైరాం ర‌మేష్ అభివ‌ర్ణించారు. రొటేష‌న్‌గా జీ20 అధ్య‌క్ష బాధ్య‌త‌లు భార‌త్‌కు ద‌క్కాయ‌ని ఇది అనివార్యంగా మ‌న‌కు రావాల్సిందేన‌ని ఆయ‌న పేర్కొన్నారు. గ‌తంలో ఈ హోదా ద‌క్కిన దేశాల‌న్నీ జీ20 అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టినందుకు డ్రామా సృష్టించ‌లేద‌ని జైరాం ర‌మేష్ ఎద్దేవా చేశారు.

జీ-20 శిఖరాగ్ర సమావేశం వచ్చే ఏడాది భారతదేశంలో నిర్వహించబడుతుంది. ఈ అత్యున్నత సమావేశం 2023 సెప్టెంబరు లో దేశ రాజధాని న్యూఢిల్లీలో జరుగుతుంది. భారత్‌కు ఇది గొప్ప అవకాశం.. జీ-20 అధ్యక్ష పదవిని పొందడం దేశానికే గర్వకారణమని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా దేశప్రజలకు ప్రధాని కోరారు. కానీ.. ఇది రాజకీయ స్టంట్ మాత్రమే అని కాంగ్రెస్ పేర్కొంది. 

'ఇలాంటి డ్రామా ఎవరూ చేయలేదు' : జైరాం రమేష్‌ 

జీ-20 అధ్యక్ష పదవి రొటేషనల్‌ అని, భారత్‌కు చైర్మన్‌ పదవి దక్కడం ఖాయమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ అన్నారు. ఇప్పటివరకు అమెరికా, బ్రిటన్, కెనడా, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, మెక్సికో, రష్యా, ఆస్ట్రేలియా, టర్కీ, చైనా, జర్మనీ, అర్జెంటీనా, జపాన్, సౌదీ అరేబియా, ఇటలీ, ఇండోనేషియాలు జీ-20కి అధ్యక్షత వహించాయని కాంగ్రెస్ నేత చెప్పారు. జీ-20
అధ్యక్ష పదవి భారత్‌కు లభించిన తర్వాత.. ఇంత హై వోల్టేజ్ డ్రామా మరే దేశం చేయలేదని బిజెపిపై జైరామ్ రమేష్ అన్నారు. మోదీని ఎగతాళి చేస్తూ.. 2014 జూలై 5న ఎల్‌కే అద్వానీ .. మోదీని గొప్ప ఈవెంట్ మేనేజర్‌గా అభివర్ణించాడనీ.. నేడు ఎల్‌కే అద్వానీ మాటలు నాకు గుర్తుకు వస్తున్నాయని అన్నారు.

జీ-20 లోగోపై వివాదం

జీ-20 సదస్సుకు సంబంధించిన లోగోను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ లోగోలో తామర పువ్వు కనిపిస్తుందనీ, బీజేపీ ఎన్నికల గుర్తు కమలం పువ్వు కావడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. 70 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ జెండాను భారత జెండాగా మార్చే ప్రతిపాదనను నెహ్రూ తిరస్కరించారని జైరాం రమేష్ ప్రజలకు చెప్పారు. ఇప్పుడు బీజేపీ ఎన్నికల గుర్తును G-20 అధ్యక్ష పదవికి అధికారిక చిహ్నంగా మారిందనీ, పిఎం మోడీ, బిజెపి తమను తాము సిగ్గు లేకుండా.. ప్రమోట్ చేసుకునే ఏ అవకాశాన్ని వదులుకోరని విమర్శించారు. 

భారతదేశానికి సువర్ణావకాశం: మోదీ

భారత్‌లో జరగనున్న జీ-20 సదస్సు దేశానికి సువర్ణావకాశమని ప్రధాని మోదీ అభివర్ణించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి మాట్లాడుతూ ..ఇప్పుడు ఒక సంవత్సరం పాటు జి-20 దేశాలతో అనుబంధం ఉన్న వ్యక్తులు మన దేశంలోని వివిధ ప్రాంతాలకు వస్తారని చెప్పారు. వీరు భవిష్యత్‌లో పర్యాటకులు కాగలరని ప్రధాని అన్నారు. జీ20 సదస్సులో పాల్గొనాలని దేశంలోని యువతకు ప్రధాని విజ్ఞప్తి చేశారు.  

click me!