వ్యవస్థను గందరగోళపరచకండి: కొలీజియం అంశంపై సుప్రీంకోర్టు

By Mahesh KFirst Published Dec 2, 2022, 4:53 PM IST
Highlights

కొలీజియంపై మరోసారి సుప్రీంకోర్టు స్పందించింది. కొలీజియం సరిగ్గా పని చేస్తున్నదని, అనవసరంగా దాన్ని గందరగోళపరచవద్దని తెలిపింది. ఇది అత్యంత పారదర్శకమైన వ్యవస్థ అని వివరించింది. మాజీ సభ్యులు కొలీజియంపై వ్యాఖ్యలు చేయడం ఫ్యాషన్‌గా మారిందని సీరియస్ అయింది.
 

న్యూఢిల్లీ: న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు కొలీజియంపై పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవస్థను సమీక్షించాలనీ ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మాత్రం కొలీజియం వ్యవస్థను సమర్థించుకుంటూనే వస్తున్నది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి సుప్రీంకోర్టు ఈ అంశంపై రియాక్ట్ అయింది.

సరిగ్గా పని చేస్తున్న వ్యవస్థను గందరగోళపరచవద్దని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎంఆర్ షా, సీటీ రవికుమార్‌లు అన్నారు. కొలీజియం చేసే పనిని చేయనివ్వండని పేర్కొన్నారు. కొలీజియం మాజీ సభ్యులు దానిపై వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిందని తెలిపారు. తమది అత్యంత పారదర్శకమైన వ్యవస్థ అని స్పష్టం చేశారు.

ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో యాక్టివిస్టు అంజలి భరద్వాజ్ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు వింటూ ఈ వ్యాఖ్యలు చేశారు. 2018లో సుప్రీంకోర్టు కొలీజియం సభ్యుల వివాదాస్పద సమావేశం గురించి ఆర్టీఐ యాక్ట్ కింద వివరాలు అందించాలని అంజలి భరద్వాజ్ రిక్వెస్ట్ చేశారు. ఈ విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అంజలి భరద్వాజ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

Also Read: కేంద్ర న్యాయ శాఖమంత్రి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు అభ్యంతరం.. ‘కొలీజియంపై అలా వ్యాఖ్యానించకుండా ఉండాల్సింది’

అంజలి భరద్వాజ్ తరఫున సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదించారు. కొలీజియం తీసుకున్న నిర్ణయాలను ఆర్టీఐ యాక్ట్ కింద వెల్లడించవచ్చునా? అనేదే ప్రశ్న అని వివరించారు. వాటి గురించి తెలుసుకునే హక్కు దేశ ప్రజలకు లేదా? అని వాదించారు. ఆర్టీఐ ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్వయంగా పేర్కొందని, ఇప్పుడు అదే కోర్టు వెనక్కి తగ్గుతున్నదని పేర్కొన్నారు. చీఫ్ జస్టిస్‌కు ప్రభుత్వానికి మధ్య జరిగిన కరస్పాండెన్స్ వివరాలు అన్ని ప్రజలకు అందుబాటులోక తేవాలని అన్నారు.

ఈ వ్యాఖ్యలకు జస్టిస్ షా సమాధానం ఇచ్చారు. ‘ఆ కొలీజియం సమావేశంలో ఏ తీర్మానమూ తీసుకోలేదు. మాజీ సభ్యులు చేసిన వాటిపై మేం కామెంట్ చేయాలని అనుకోవడం లేదు. కొలీజియం మాజీ సభ్యులు నిర్ణయాలపై కామెంట్లు చేయడం ఇప్పుడు ఒక ఫ్యాషన్‌గా మారింది’ అని అన్నారు. తమది అత్యంత పారదర్శకమైన వ్యవస్థ అని, తాము వెనక్కి తగ్గడం లేదనీ తెలిపారు. అప్పుడు మౌఖికంగా చాలా నిర్ణయాలు తీసుకున్నారని వివరించారు.

2018 డిసెంబర్ 12న సుప్రీంకోర్టు కొలీజియం సమావేశానికి సంబంధించిన అజెండా, మినిట్స్, తీర్మానాలను వివరించాలని దాఖలైన అప్పీల్‌ను ఢిల్లీ హైకోర్టు జులైలో తోసిపుచ్చింది. 

మాజీ సీజేఐ రంజన్ గొగోయ్ రాసుకున్న ఆత్మకథ (జస్టిస్ ఫర్ ది జడ్జీ)లో 2018 కొలీజియం సమావేశం గురించి పేర్కొన్నాడని, అందుకు సంబంధించిన విషయాలను అంజలి భరద్వాజ్ తన పిటిషన్‌లో ఉటంకించారు.

click me!