పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నెహ్రూ కారణమట: బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Aug 1, 2021, 7:24 PM IST
Highlights

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి తొలి ప్రధానమంత్రి జవహార్‌లాల్ నెహ్రూనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత మధ్యప్రదేశ్ మంత్రి విశ్వాస్ సారంగ్. వాటిని నియంత్రించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. 

మధ్యప్రదేశ్ మంత్రి విశ్వాస్ సారంగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి కారణం దేశ తొలి ప్రధానమంత్రి జవహార్‌లాల్ నెహ్రూనే అంటూ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వదేశీ సంస్కృతిని త్యజించడం వల్లనే దేశంలో ధరలు పెరుగుతున్నాయని విశ్వాస్ అన్నారు. విదేశాల్లో చదువుకున్న నెహ్రూ.. భారతీయ సంస్కృతిని తిరస్కరించారని, ఆయనపై విదేశీ సంస్కృతి ప్రభావం వల్లే తొలి ప్రధాని అలా చేశారని విశ్వాస్ వ్యాఖ్యానించారు.

దేశాభివృద్ధి ఘనత అంతా నెహ్రూదేనని కాంగ్రెస్ నేతలు అంటుంటారని.. మరి గ్రామాలు, వ్యవసాయం ఎందుకు వెనకబడి ఉందో చెప్పాలి అని సారంగ్ డిమాండ్ చేశారు. గాంధీ కుటుంబ పాలనలో ఆర్థిక విధానం గ్రామాలు, వ్యవసాయాన్ని ఎందుకు బాగు పర్చలేదో చెప్పాలన్నారు. నెహ్రూ విదేశాల్లో చదువుకున్నారని... ఆ సంస్కృతి ప్రభావం వల్ల ఆయన మన దేశ సంస్కృతిని పక్కనపెట్టారని సారంగ్ ఆరోపించారు. దేశంలో ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉందని.. ఇది కాంగ్రెస్ పాలన కారణంగా వచ్చిందని ఆయన దుయ్యబట్టారు. పెట్రోల్, డీజిల్ ధరలు తమ చేతిలో ఉండవని.. ప్రపంచ మార్కెట్ విధానాలకు అనుగుణంగా ఉంటాయని విశ్వాస్ స్పష్టం చేశారు. తాము వాటిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నామని.. గతంలో అనేకసార్లు ధరలను తగ్గించాం అని విశ్వాస్ సారంగ్ గుర్తుచేశారు. 

click me!