
Jayaprada missing ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద కనిపించకుండా పోయారు. దీంతో ఆమె కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు గాలిస్తున్నారు. అమెను అరెస్టు చేయాలనే ఉద్దేశంతో వారెంట్ తో యూపీతో పాటు ముంబైలోనూ గాలింపు చర్యలు చేపట్టారు. కానీ జయ ఆచూకీ మాత్రం దొరకడం లేదు. జయప్రదను అరెస్ట్ చేసేందుకు రాంపూర్ ఎస్పీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
అసలేం జరిగిందంటే ?
2019లో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై జయప్రద పోటీ చేశారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గంలోని నూర్పూర్ గ్రామంలో ఓ రోడ్డును ప్రారంభించారు. అలాగే కెమ్రీలోని పిప్లియా మిశ్రా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కింద ఆమెపై రెండు కేసులు నమోదు అయ్యాయి. అయినప్పటికీ ఆమె ఆ ఎన్నికల్లో ఓడిపోయింది.
అప్పటి నుంచి రాంపూర్‌లోని ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టులో ఈ రెండు కేసులు కొనసాగుతున్నాయి. పోలీసులు ఈ కేసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దీంతో జయప్రదను హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. కానీ జయప్రద ఆ ఆదేశాలను పట్టించుకోకుండా పలు విచారణలకు గైర్హాజరయ్యారు. చివరకు కోర్టు ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. జయప్రదను అరెస్టు చేసి జనవరి 10లోగా హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు యూపీతో పాటు ఢిల్లీ, ముంబైలలో ఆమె కోసం వెతుకుతున్నారు.
ఏపీకి చెందిన జయప్రద తండ్రి సినిమా ఫైనాన్షియర్. 30 ఏళ్ల సినీ జీవితంలో జయప్రద 300 సినిమాల్లో ఆమె నటించారు. సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలోకి ఆమె 1994లో చేరారు. తరువాత జయప్రద చంద్రబాబు నాయుడు బృందంలో చేరారు. 1996లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అయితే విభేదాల కారణంగా ఆమె టీడీపీని వీడారు. తరువాత సమాజ్ వాదీ పార్టీలో చేరారు. 2004 ఎన్నికల్లో రాంపూర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. 2009 ఎన్నికల్లోనూ ఆమె విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికలకు ముందు ఆమె బీజేపీలో చేరారు. కానీ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు.