మధురై ఎయిర్‌పోర్ట్‌లో కరోనా కలవరం.. చైనా నుంచి తిరిగివచ్చిన తల్లీకూతుళ్లకు పాజిటివ్‌గా నిర్దారణ..

By Sumanth KanukulaFirst Published Dec 28, 2022, 12:19 PM IST
Highlights

తమిళనాడులో మధురై ఎయిర్‌పోర్ట్‌లో కరోనా కలవరం రేపింది. చైనా నుంచి కొలంబో మీదుగా మధురై విమాశ్రయం చేరుకున్న ఒక మహిళకు, ఆమె ఆరేళ్ల కూతురికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది.

తమిళనాడులో మధురై ఎయిర్‌పోర్ట్‌లో కరోనా కలవరం రేపింది. చైనా నుంచి కొలంబో మీదుగా మధురై విమాశ్రయం చేరుకున్న ఒక మహిళకు, ఆమె ఆరేళ్ల కూతురికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. పలు దేశాల్లో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న చైనా, జపాన్‌, దక్షిణకొరియా, సింగపూర్‌, థాయ్‌లాండ్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీ పీసీఆర్‌ పరీక్షను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దేశంలో అన్ని ఎయిర్‌పోర్ట్‌లో ఆ దేశాల నుంచి వచ్చినవారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే మధురై విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. ఒక మహిళకు, ఆమె కూతురుకి కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఆ మహిళ మదురై సమీపంలోని విరుదునగర్‌కు చెందినవారు. ప్రస్తుతం మహిళను, ఆమెను కూతురు విరుదునగర్‌లో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వారి నమునాలును పూర్తి జన్యు శ్రేణి విశ్లేషణ కోసం పంపనున్నారు. 

ఇదిలా ఉంటే..  మంగళవారం తమిళనాడులో కొత్తగా 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 51గా ఉంది. ఇక, చైనాతో పాటు పలు దేశాలలో అకస్మాత్తుగా కరోనావైరస్ కేసులు పెరగడంతో తమిళనాడు ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలోని నాలుగు విమానాశ్రయాలకు చేరుకున్న ప్రయాణీకులందరికీ స్క్రీనింగ్‌ను ముమ్మరం చేసింది.
         
మంగళవారం తమిళనాడు ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో కోవిడ్-19 మాక్ డ్రిల్‌ను పరిశీలించిన సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి ఏదైనా ఉంటే దానిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని చెప్పారు.

click me!