
ఎంపీ పదవిని పునరుద్దరించిన తరువాత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మొదటి సారిగా బుధవారం లోక్ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మణిపూర్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ‘ప్రధాని నరేంద్ర మోడీ మణిపూర్ ను భారతదేశంలో భాగంగా పరిగణించరు’ అని అన్నారు.
‘‘కొన్ని రోజుల క్రితం మణిపూర్ వెళ్లాను. కానీ మన ప్రధాని ఈ రోజుకు కూడా వెళ్లలేదు, ఎందుకంటే ఆయనకు మణిపూర్ భారతదేశంగా భావించడం లేదు.’’ అని రాహుల్ గాంధీ విమర్శించారు. మణిపూర్ పై ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఆయన..‘‘మీరు మణిపూర్ లో భరతమాతను చంపారు’’ అని ఆరోపించారు. మణిపూర్ లో భారత సాయుధ దళాలను ప్రభుత్వం ఎందుకు ఉపయోగించడం లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
‘‘స్పీకర్ గారూ.. నన్ను లోక్ సభ ఎంపీగా తిరిగి నియమించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను చివరిసారిగా మాట్లాడినప్పుడు, నేను అదానీపై దృష్టి పెట్టడం వల్ల మీకు ఇబ్బంది కలిగించాను. దాని వల్ల బహుశా మీ సీనియర్ నాయకుడు బాధపడి ఉండవచ్చు... ఆ నొప్పి మీపై కూడా ప్రభావం చూపి ఉండవచ్చు. అందుకు నేను మీకు క్షమాపణలు చెబుతున్నాను. కానీ నేను నిజం చెప్పాను. ఈ రోజు బీజేపీలోని నా స్నేహితులు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ రోజు నా ప్రసంగం అదానీపై కాదు...’’ అని రాహుల్ గాంధీ తన ప్రసంగం ప్రారంభంలో అన్నారు.
తన ప్రసంగంలో రాహుల్ గాంధీ ప్రధాని మోడీని ‘రావణుడు’ అంటూ పోల్చాడు. ఆయన (మోడీ) ప్రజల మాట వినడని, అందుకే ఆయన ‘అహంకారి’ అని అన్నారు. రామాయణ ఇతిహాసాన్ని ప్రస్తావిస్తూ.. ‘లంకను హనుమంతుడు తగలబెట్టలేదు, రావణుడి అహంకారంతోనే అతి కాలింది. రాముడు రావణుడిని చంపలేదు. అతడి అహంకారంతోనే చనిపోయాడు’ అని అన్నారు.
భారత సైన్యం ఒక్కరోజులో మణిపూర్‌లో శాంతిని నెలకొల్పగలదని రాహుల్ గాంధీ నొక్కిచెప్పారు. అయితే ప్రభుత్వం దాని సేవలను ఉపయోగించుకోవడం లేదని ఆరోపించారు. నుహ్ లో జరిగిన మత ఘర్షణలు ఉద్దేశిస్తూ.. ప్రస్తుతం హర్యానాలో కూడా ప్రభుత్వం అదే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
కాగా.. రాహుల్ గాంధీ మాట్లాడుతుండగా పలువురు బీజేపీ సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకుని నినాదాలు చేశారు. కిరణ్ రిజిజు, స్మృతి ఇరానీలతో సహా కేంద్రమంత్రులు కాంగ్రెస్ నాయకుడిపై ఎదురుదాడికి దిగారు. మణిపూర్‌పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.