కేరళలో భారీ వర్షాలు, 72 మంది మృతి: ఈ సాయం చాలదన్న రాహుల్

Siva Kodati |  
Published : Aug 12, 2019, 11:23 AM IST
కేరళలో భారీ వర్షాలు, 72 మంది మృతి: ఈ సాయం చాలదన్న రాహుల్

సారాంశం

ప్రస్తుతం కేరళలలో పరిస్ధితి దారుణంగా ఉందని... ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు ఏమాత్రం సరిపోవని.. తక్షణం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆయన ప్రధాని మోడీని కోరారు. వరద ప్రభావిత రాష్ట్రాలకు సాయం విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి షేర్ గిల్ ఆరోపించారు. 

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో వరదలు, కొండచరియలు, గోడలు విరిగిపడటం తదితర కారణాలతో ఆదివారం నాటికి కేరళలో 72 మంది చనిపోగా.. 58 మంది గల్లంతయ్యారు. ఒక్క మలప్పురం జిల్లాలోనే దాదాపు 11 మంది చనిపోగా.. కవలప్పర గ్రామంలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో సుమారు 50 మంది గల్లంతయ్యారు.

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఆదివారం కేరళలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించారు. ప్రస్తుతం కేరళలలో పరిస్ధితి దారుణంగా ఉందని... ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు ఏమాత్రం సరిపోవని.. తక్షణం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆయన ప్రధాని మోడీని కోరారు.

వరద ప్రభావిత రాష్ట్రాలకు సాయం విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి షేర్ గిల్ ఆరోపించారు. వరదలు లేకున్నా ఉత్తరప్రదేశ్‌కు రూ.200 కోట్లు కేటాయించి.. వరదలతో అతలాకుతలమైన అస్సాంకు రూ. 250 కోట్లు కేటాయించడం దారుణమన్నారు.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రెండు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. 1,318 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎప్పటికప్పుడు పరిస్ధితిని సమీక్షిస్తున్నారు.

సహాయక బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. పెరియార్ డ్యామ్‌లో భారీగా వరద నీరు చేరడంతో కొచ్చి ఎయిర్‌పోర్ట్ శుక్రవారం నుంచి మూసివేశారు. మరోవైపు భారీ వర్షాలు, వరదల కారణంగా కర్ణాటకలో 31, మహారాష్ట్రలో 35, గుజరాత్ 31, మధ్యప్రదేశ్‌‌లో 32 మంది ప్రాణాలు కోల్పోయారు.

వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, కోస్ట్ గార్డ్, నేవీతో పాటు వాయుసేనను కేంద్రం రంగంలోకి దించింది. రోడ్డు మార్గాలు ధ్వంసమైన ప్రాంతాల్లో ప్రజలకు అధికారులు హెలికాఫ్టర్ల ద్వారా ఆహార పదార్ధాలు, తాగునీరు అందజేస్తున్నారు.

ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు పొందిన హంపీలోకి వరద నీరు చొచ్చుకురావడంతో అధికారులు పర్యాటకుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌