
Weather Update: రుతుపవనాల రాకతో దేశంలోని చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో బలమైన గాలులతో వర్షాలు కురుస్తున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రుతుపవనాలు పూర్తి చురుకైన దశలోకి వచ్చాయని వాతావరణ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ కుమార్ తెలిపారు. మధ్యప్రదేశ్ లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా గుజరాత్, గోవాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ గుజరాత్, కొంకణ్-గోవాలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాగల 20 రోజుల పాటు దేశంలోని తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మధ్యప్రదేశ్ లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. పన్నా, దామోహ్, సాగర్, టికంగఢ్, ఛతర్పూర్, నివారి, మంద్సౌర్, నీముచ్, గుణ, అశోక్ నగర్, శివపురి, రాజ్ గఢ్ లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉమరియా, కట్ని, జబల్పూర్, నర్సింగ్ పూర్, సియోని, బాలాఘాట్, షియోపూర్, భింద్, మొరేనా, గ్వాలియర్, దతియా, షాజహాన్ పూర్, అగర్, ఉజ్జయిని, రత్లాం, ఝబువా, అలీరాజ్ పూర్ బర్వానీ, భోపాల్, విదిషాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది.
ముంబయిలో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
ముంబయిలో నేటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ పేర్కొంది. ఈ క్రమంలోనే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో పాటు ఉత్తరాఖండ్ లోని నైనిటాల్, పౌరి, తెహ్రీ, పితోర్ గఢ్, డెహ్రాడూన్, హరిద్వార్, బాగేశ్వర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. జూన్ 30, జూలై 1, 2 తేదీల్లో ఉత్తరాఖండ్ లో వాతావరణ హెచ్చరిక ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు జూలై 2 వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ సమయంలో సాధారణ ప్రజలు, యాత్రికులు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోనూ..
ప్రయివేటు వాతావరణ సంస్థ స్కైమెట్ ప్రకారం, రాజస్థాన్ లో భారీ వర్షాలు కొనసాగుతాయి. తూర్పు, పశ్చిమ రాజస్థాన్ లో మరికొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం ఢిల్లీ-ఎన్సీఆర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాలు, సౌరాష్ట్ర, కచ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ లోని మిగిలిన ప్రాంతాలు, జార్ఖండ్ లోని కొన్ని ప్రాంతాలు, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్ గఢ్ లోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయి..
జమ్మూకశ్మీర్, లడఖ్, పశ్చిమ రాజస్థాన్ లో తేలికపాటి వర్ష సూచన ఉందని తెలిపింది. అదేవిధంగా హిమాలయాలను ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాంలోని కొన్ని ప్రాంతాలు, బీహార్ లోని దిగువ ప్రాంతాలు, ఈశాన్య ఉత్తరప్రదేశ్ లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగ్నేయ, దక్షిణ రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్ ప్రాంతం, కొంకణ్, గోవా, కోస్తా కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.